Huge Current Bill : వారిది అపార్ట్మెంట్లోని ఓ ప్లాట్.. విద్యుత్ బిల్లు ప్రతి నెలా రూ. 200లోపే వస్తుంటుంది. కానీ ఈ నెలలో మాత్రం వచ్చిన బిల్లు చూస్తే వారికి నిజంగానే కరెంట్ షాక్ తగిలింది. ఈ నెలలో కరెంటు బిల్లు అక్షరాలా రూ.3కోట్ల 20 లక్షల 5వేల,218 వచ్చింది. సర్వీసు నెంబర్కు ఉన్నన్ని సంఖ్యల్లా ఉన్న బిల్లు మొత్తాన్ని చూసి ఇంటి యజమాని షాకయ్యాడు.
మహబూబాబాద్ పట్టణంలో కృష్ణవేణి స్కూల్ సమీపంలోని బొల్లం నాగేశ్వరరావు అపార్ట్మెంట్లో ప్లాట్ నెంబర్ 302కు భారీ మొత్తంలో విద్యుత్ బిల్లు వచ్చింది. ప్రతి నెల రూ.200లోపు వచ్చే బిల్లు.. ఈసారి రూ.3కోట్లకు పైగా రావడంతో ఇంటి యజమానితో పాటు అపార్ట్మెంట్ వాసులు అవాక్కయ్యారు.
అధికారులు ఏమంటున్నారు...
విద్యుత్ బిల్లు విషయంలో ఎక్కడో తప్పు జరిగి ఉంటుందని... సరి చేసి ఇవ్వాలని అపార్ట్మెంట్ వాసులు కోరగా.. బిల్లుపై ప్రింట్ తప్పుగా పడిందని.. సరిచేసి ఇస్తామంటున్నారు విద్యుత్ శాఖ అధికారులు. ఏది ఏమైనా సర్వీసు నెంబర్ అంత ఉన్న బిల్లు మొత్తాన్ని చూసి.. ఇంటి యజమానికి చలికాలంలో కూడా చెమటలు పట్టాయి.
ఇదీ చూడండి : Polytechnic Exam Paper Leak: పాలిటెక్నిక్ పేపర్ లీక్ ఘటనలో నలుగురికి రిమాండ్