Young Man Got Three Govt Jobs In Asifabad : చిన్నప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడీ యువకుడు. చదువులోనూ ముందుండేవాడు. పైగా చదువుకు తల్లిదండ్రుల నుంచి మంచి ప్రోత్సాహం. పెద్దల నుంచి సలహాలు, సూచనలు. వీటన్నింటికి మించి మనోడి హార్డ్ వర్క్. ఫలితంగా 4 ఏళ్లలో 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపిస్తున్నాడు.
3 కొలువుల్ని అవలీలగా పట్టేసిన ఈ యువకుడి పేరు సిరికొండ అజయ్ చారి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, రెబ్బెన మండలం, గోలేటి ఇతని స్వస్థలం. తల్లిదండ్రులు సిరికొండ రామయ్య. రమాదేవి. తండ్రి కులవృత్తి చేస్తున్నాడు. తల్లి గృహిణి. ఇతనికి చిన్నప్పటి నుంచి ప్రభుత్వ కొలువు చేయాలనే ఆశ ఉండేది. ఆశ ఉంటే సరిపోదు కదా అందుకు తగ్గట్లు శ్రమించి కొలువు చేపట్టాలి. ఇతనూ అదే చేశాడు.
పోటీ పరీక్షల్లో నెగ్గాలంటే.. ఇలా సన్నద్ధమవ్వండి!
Young Man Three Govt Jobs In Four Years : పదో తరగతి వరకు స్వస్థలంలోనే చదువుకున్న అజయ్ ఇంటర్ హుజూరాబాద్‌లో చేశాడు. తర్వాత డిగ్రీ హైదరాబాద్‌లో పూర్తి చేసి 2019 లో పంచాయతీ కార్యదర్శి కోసం సిద్ధమయ్యాడు. ఆ ప్రయత్నంలో విజయం సాధించి జైనూర్ మండలంలో ఏడాది కాలం పాటు జూనియర్ పంచాయతీ సెక్రెటరీగా విధులు నిర్వర్తించాడు. ఆ క్రమంలోనే కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రయత్నించి అందులోనూ విజయం సాధించాడీ యువకుడు.
"రీసెంట్‌గా వచ్చిన ఎస్సై నోటిఫికేషన్‌లో నేను డిప్యూటీ జైలర్‌గా ఎంపిక అవ్వడం జరిగింది. కాళేశ్వరం జోన్1 కు సంబంధించి ఐదు జిల్లాలకు కలిపి డిప్యూటీ జైలర్ ఒక్కటే పోస్టు ఉంది. అది నాకే రావడం ఎంతో ఆనందంగా ఉంది. భవిష్యత్‌లో గ్రూప్1 లక్ష్యంగా ప్రిపరేషన్ సాగిస్తున్నాను. నా ఇద్దరి మేనమామలు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ మూడు ఉద్యోగాలను సాధించాను." - అజయ్ చారి, మూడు ఉద్యోగాల విజేత
సిలబస్ ఏంటో తెలుసుకొని చదవాలి : కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తూనే ఎస్‌ఐ కోసం ప్రిపేర్ అయ్యాడు. ఈ క్రమంలో డిప్యూటీ జైలర్‌గా ఎంపికయ్యాడు. దీంతో ఇప్పటికి 3 ఉద్యోగాలు సాధించిన వ్యక్తిగా నిలిచాడు. ఈ విజయం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని అంజయ్ చారి చెబుతున్నారు. ఉద్యోగ సాధనలో ప్రశ్నపత్రం విధానంపై పూర్తి అవగాహన అవసరమని అజయ్ చారి చెబుతున్నారు. ముందుగా సిలబస్ ఏం ఉంది ఎందులో నుంచి ఎక్కువ మార్కలు పొందగలం లాంటి విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి అందుకు తగ్గట్లుగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలంటున్నారు. అదే తన విజయ రహస్యమని యువతకు సందేశం ఇచ్చారు.
"ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు తన మేనమామ కరీంనగర్ జిల్లాలో ఎస్‌ఐగా పనిచేస్తున్న శేఖర్ చారి కారణం. ఆయనతో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఈ స్థాయికి చేరాను. భవిష్యత్‌లో గ్రూప్ 1 సాధించడమే లక్ష్యం. ఖాళీ దొరికినప్పుడల్లా చదువుతానని" అజయ్ చారి అంటున్నారు.
గ్రూప్1 అనే చివరి లక్ష్యం : చిన్ననాటి నుంచి చదువులో ముందున్న తమ కుమారుడు ఇలా మూడు ఉద్యోగాలు సాధించడం పట్ల తల్లిదండ్రులతో పాటు మేనమామ శేఖర్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మూడు ఉద్యోగాలు సాధించినందుకు చాలా ఆనందంగా ఉందంటున్నాడు అజయ్. కానీ., తనకు ఇష్టమైన గ్రూప్-1 స్థాయి ఉద్యోగం సాధించేందుకు కృషి చేస్తానని అంటున్నాడు. భవిష్యత్‌లో అతను మరింత ముందుకెళ్లాలని ఆశిద్దాం.
Railway jobs 2023 : రైల్వేలో 790 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. అప్లై చేసుకోండిలా!
అంధుడి ఆత్మవిశ్వాసం.. కష్టపడి గవర్నమెంట్ జాబ్.. ఆఫీస్‌లో ఫుల్ యాక్టివ్‌గా..