సార్సాల ఊళ్లోకి ఏ వాహనమొచ్చినా పిల్లలు పెద్దలు ఆశగా ఎదురొస్తారు. జైలు కెళ్లిన తన బిడ్డలు తిరిగొచ్చారేమోనని తల్లులు ఎదురుచూస్తుంటే... దూరమైన అమ్మనాన్న వచ్చేశారేమోనని పిల్లలు ఎదురుచూస్తుంటారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సార్సాల పోడు భూముల ఘటన కొన్ని నిరుపేద కుంటుంబాలను కకావికలం చేసింది. కన్నవాళ్లు జైలుపాలవడం చిన్నారుల పాలిట శాపంగా మారింది.
అందరికీ దూరమై ఒంటరిగా మిగిలింది
కొన్నేళ్లుగా సార్సాల అటవీ పోడుభూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న కుటుంబాలను అటవీశాఖ అక్కడ నుంచి తరలించడానికి ప్రయత్నించిన విషయం విధితమే. అటవీ శాఖ అధికారులకు స్థానికులకు మధ్య జరిగిన వివాదంలో 31 కుటుంబాలపై అటవీశాఖ నేరం మోపింది. వారంతా కుటుంబాలతో సహా జైలుపాలయ్యారు. అప్పటి నుంచి ఇంటి దగ్గరున్న పిల్లల పరిస్థితి దయనీయంగా మారింది. తన కుటుంబంలో ముగ్గురు జైలుపాలయ్యారని తాను చదువు మానేసి అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నానని కన్నవాళ్లను తలచుకుని కన్నీటి పర్యంతమవుతోంది లక్ష్మి అనే అమ్మాయి.
నేనేమి తప్పుచేశాను
ఇదే ఘటనలో జైలుకెళ్లిన మరో కుటుంబానిది మరింత దయనీయ స్థితి. నాయిని చిన్న శీను అనే వ్యక్తికి భార్య ఇద్దరు పిల్లలు. అప్పుడు జరిగిన గొడవల్లో శీను జైలుపాలయ్యాడు. కంటి చూపు సరిగాలేని భార్య ఇద్దరు చిన్నపిల్లలున్న ఆ కుటుంబం రోడ్డున పడింది. అనారోగ్యంతో మంచానపడి ఉన్న తల్లితో పాటు వంట, ఇంటి బాధ్యత మూడో తరగతి చదువుతున్న స్వప్నపై పడింది. బడిమానేసి ఇంట్లో అన్నీ తానై అసలు సంతోషమంటే ఏమిటో తెలియకుండా బతుకుతోంది ఈ చిన్నారి.
అసలు ఈ గొడవలేంటో తెలియదు... తల్లిదండ్రులు ఎందుకు జైలుపాలయ్యారో తెలియదు... ఎప్పడొస్తారో తెలియదు.. తమ తోటి వారంతా అయినవాళ్లతో సంతోషంగా ఉంటే తమ బతుకులెందుకింత దుర్భరంగా మారాయో తెలియదు. ఈ తప్పు ఎవరు చేశారో అన్న విషయం పక్కన పెడితే శిక్షమాత్రం ఈ చిన్నారులు అనుభవించాల్సి వస్తోంది.
ఇదీ చూడండి: అడవుల నుంచి గిరిజనులను పంపే కుట్ర: లోక్సభలో రేవంత్