కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని ఈజ్ గాం, భట్టుపల్లి ఏజెన్సీ పంచాయతీల్లో 1/70 చట్టాన్ని అతిక్రమించి లేఅవుట్లు లేకుండానే ప్లాట్ల క్రయ విక్రయాలు జరుపుతున్నారు. 1/70 చట్టం ప్రకారం గిరిజనేతరులు ఇక్కడి భూములపై క్రయవిక్రయాలు జరపొద్దనే నిబంధనలున్నాయి. అయినప్పటికీ ప్రధాన రహదారి పక్కనే ఈ భూములు ఉండటం… కాగజ్ నగర్ పట్టణానికి చేరువలో ఉండలం వల్ల ఈ భూములు ఎక్కువ ధర పలుకుతున్నాయి. ఈ భూములను కొంతమంది దళారులు రైతుల వద్ద తక్కువ ధరకు కొని... ఇళ్ల స్థలాలుగా మార్చి ఒక్కో ఇంటి స్థలాన్ని లక్షల్లో విక్రయిస్తున్నారు. అనధికారికంగా బాండు పేపర్లపై విక్రయ దస్తావేజులు రాయించి ఇంటి స్థలాల కొనుగోలుదారులకు అందజేస్తున్నారు.
ఒక్కో ఎకరానికి 15 నుంచి 20 లక్షలకు కొనుగోలు చేసిన దళారులు... ఎకరం భూమిలో 20 ప్లాట్లు చేసి 2 నుంచి 3 లక్షల వరకు ఒక్కో ప్లాటును విక్రయించి ఆదాయం గడిస్తున్నారు. నిబంధనల ప్రకారం సాగు భూములను వాణిజ్య వినియోగంగా మార్చేందుకు రెవెన్యూ శాఖ నుంచి నాలా అనుమతి పొందాలి. లేఅవుట్‌కు గ్రామ పంచాయతీ అనుమతి ఉండాలి. ఇళ్ల స్థలాల్లో 25 ఫీట్ల వెడల్పుతో అంతర్గత రోడ్లు ఉండాలి. విద్యుత్ లైన్లు, మురుగు కాలువలు, పార్కు ఉండాలి. తాగునీటి పైపులైన్లు వేయించాలి. కానీ అవేవి పట్టించుకోకుండా తమ పని చేసుకుపోతున్నారు అక్రమార్కులు. ఈ విషయంపై తహసీల్దారు ప్రమోద్ కుమార్‌ను సంప్రదించగా విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇదీ చదవండి : మాంసం దుకాణాల వద్ద బారులుతీరిన జనం.. కనిపించని భౌతికదూరం