కుమురం భీం జిల్లా వాసులకు కొన్ని రోజులుగా వణుకు పుట్టిస్తున్న పెద్దపులి.. తిరిగి మహారాష్ట్ర వెళ్లినట్లు అధికారులు తెలిపారు. గత కొన్నేళ్లుగా కాగజ్నగర్ టైగర్ కారిడార్లో పులులు సంచరిస్తున్నప్పటికీ ఎప్పుడూ మనుషులపై దాడి చేయలేదు. కానీ గతేడాది ఓ పులి ఇద్దరిని చంపినప్పటి నుంచి అటవీశాఖ అప్రమత్తమై ప్రత్యేక బృందాలతో గాలింపు ప్రారంభించింది. మహారాష్ట్ర నుంచి వచ్చి.. అటవీ అధికారులకు చిక్కకుండా తిరుగుతోంది. ఇదే సమయంలో మరో మగపులి మంచిర్యాల జిల్లా చెన్నూరు, నిల్వాయి, కోటపల్లి అడవుల్లో సంచరించి ఎవరికి హాని తలపెట్టకుండా తిరిగి వెళ్లిపోయింది. ఈరెండు పులుల్లో అధికారులు ఒకదానికి ఏ1 గా, దాడులకు పాల్పడుతున్న పులికి ఏ2గా నామకరణం చేశారు.
ఏ2 మగపులి చంద్రపూర్ జిల్లాని చంద్రపూర్ థర్మల్ విద్యుత్ కేంద్రం పరిసర అడవులో జన్మించగా.. చిన్నప్పటినుండి విచిత్ర స్వభావం కలిగి ఉన్నట్లు అక్కడి అధికారులు గుర్తించారు. మానవ సంచార ప్రదేశాలకు తరచుగా వెళ్లి... పలుమార్లు మనుషులపై దాడి చేసేందుకు యత్నించిందని తెలిపారు. అలా ఆవాసం వెతుక్కుంటూ తెలంగాణలోకి ప్రవేశించిందని గుర్తించారు. ఇతర పులుల ఆవాసాలు ధ్వంసం చేయడం, మనుషులపై దాడి వంటి పనులు చేస్తోందని అధికారులు వివరించారు. ప్రస్తుతం ఇది మహారాష్ట్ర అడవుల్లోకి వెళ్లిందని తిరిగి రాగానే మళ్లీ బంధించే పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
ఇదీ చూడండి: సాగునీటి గోసకు శాశ్వత పరిష్కారం: సీఎం కేసీఆర్