18 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఒక అసాధారణ కార్యక్రమం మొదలైందని వైఎస్ షర్మిల అన్నారు. దివంగత వైఎస్ఆర్ తన ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభించినట్లు గుర్తుచేశారు. ఎర్రటి ఎండల్లో రైతులు, బలహీన వర్గాల కష్టాలు తెలుసుకొని ప్రజాప్రస్థానం సాగినట్లు చెప్పారు. సంక్షేమ పాలనకు పునాదులు వేసుకొంటూ.. వైఎస్ఆర్ పాదయాత్ర సాగిందని షర్మిల తెలిపారు. ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా రైతులు, ప్రజలు కష్టాలు వింటూ.. వారికి భరోసానిస్తూ సాగినట్లు తెలిపారు. రాజన్న సంక్షేమ పాలన తిరిగి తీసుకొచ్చేందుకు.. తన రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తునట్లు షర్మిలా తెలిపారు. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన సంకల్ప సభలో షర్మిలా ఈ ప్రకటన చేశారు.
నిలదీసేందుకే..
కోటి ఎకరాలకు నీళ్లివ్వాలని జలయజ్ఞం ప్రాజెక్టుకు రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టినట్లు ఆమె తెలిపారు. ప్రాణహిత- చెవేళ్లు ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో 16 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలని వైఎస్ఆర్ తలపెట్టినట్లు చెప్పారు. కేవలం 38 వేల కోట్ల రూపాయలతో ఆ పూర్తయ్యేదన్నారు. అదే ప్రాజెక్టును కేసీఆర్ వచ్చాక.. రీడిజైన్ పేరు చెప్పి.. నిర్మాణ వ్యయాన్ని అమాంతం లక్ష ముప్పై వేల కోట్లకు రూపాయలకు పెంచినట్లు షర్మిలా ఆరోపించారు. ఆ ప్రాణహిత- చెవేళ్ల ప్రాజెక్టులో అవినీతిని ప్రశ్నించడానికి.. రుణమాఫీపై నిలదీయడానికి, మహిళల సున్నావడ్డీ, నిరుద్యోగుల సమస్యలు, ఫీజు రియంబర్స్మెంట్, డబుల్ బెడ్ రూం ఇళ్లు, ముస్లిం రిజర్వేషన్లపై.. ప్రశ్నించేందుకే రాజకీయ పార్టీ ప్రారంభిస్తున్నట్లు షర్మిల స్పష్టం చేశారు.
జులై 8న పార్టీ ప్రకటన..
జులై 8న వైఎస్ జయంతి రోజు పార్టీ పేరు, అజెండా ప్రకటిస్తామని షర్మిల ప్రకటించారు. తాను ఎవరు పిలిస్తే రాలేదని.. ఎవరి కిందా పనిచేయనని ఆమె పేర్కొన్నారు. తెలంగాణకు అన్యాయం జరిగే ఏ పనినైనా అడ్డుకుంటానని స్పష్టం చేశారు.
ఉద్యోగాల భర్తీ కోసం, నిరుద్యోగ భృతి కోసం ఈ నెల 15 నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్ వేదికగా నిరాహార దీక్ష చేయబోతున్నట్లు షర్మిల ప్రకటించారు. నాలుగో రోజు నుంచి అన్ని జిల్లాల్లో తమ పార్టీ నేతలు, కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు చేస్తారన్నారు.
ఇవీచూడండి: షర్మిల రాజకీయ భవిష్యత్తు తెలంగాణతోనే ముడిపడి ఉంది: విజయమ్మ