Hail rain in khammam: రాష్ట్రంలో రెండు రోజులుగా అనుకోకుండా కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ధాన్యం పండించి అమ్మేందుకు తీసుకెళ్తే.. ప్రభుత్వం కొనేలోపే ఇలా వర్షాలు రావడంతో వర్షం నీరు.. రైతుల కళ్లలో కన్నీటి బిందువుగా మారుతుంది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని వడగళ్ల వర్షానికి పంటలు తీవ్ర నష్టం జరిగింది. ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయ్యాయి. వడగళ్లు పడటంతో రైతులకు తీవ్ర గాయాలయ్యాయి. పొలాల్లో, రోడ్డుపై ఉన్న ధాన్యం కొట్టుకుపోయింది. ధాన్యం కల్లాల్లోకి తీసుకువచ్చి నెల రోజులు అయినా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఆరబెట్టిన ధాన్యం రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి తడిసి ముద్ద అయిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ధాన్యాన్ని కొనుగోలు చెయ్యాలి: ప్రధాన రహదారులకు ఇరు పక్కల.. పంట ఎండేందుకు ఆరబోసిన ధాన్యం నీటితో మునిగిపోయాయని కర్షకులు వాపోయారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. ధాన్యం కొనుగోలు చేయనందున తాము అనేక ఇబ్బందులకు గురి అవుతున్నామని తెలిపారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, నష్టపోయిన పంటపై ప్రభుత్వం స్పందించి.. రైతులకు పరిహారం అందించాలని వారు కోరుతున్నారు.
చిరు వ్యాపారులకు ఇబ్బందులు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇల్లందు, టేకులపల్లి మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడ్డాయి. కొమరారం, పోలారం, అమర్ సింగ్ తండా, మర్రిగూడెం, మామిడి గూడెం, ధర్మారం తండా ప్రాంతాల్లో జోరువాన కురిసింది. మరికొన్ని గ్రామాల్లో వడగళ్ల వాన పడింది. ఈదురు గాలులతో కూడిన వర్షం వల్ల రోడ్డుపైన అక్కడక్కడ చెట్లు పడిపోడంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పలేదు. పలుచోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. సాయంత్రం వర్షం పడడంతో చిరు వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు.
ఉపశమనం కలిగించిన వాన: ఉదయం నుంచి ఎండతో అల్లాడిన నగరవాసులకు.. ఈ వర్షాల వల్ల చల్లదనాన్ని ఆస్వాదించామని కొంత మంది స్థానికులు చెబుతున్నారు. ఎండ తీవ్రతను తట్టుకునేలా ఈ వర్షాలు కాస్త ఉపశమనం కలిగించాయని ప్రజలు తెలిపారు. ఇలా ఉదయం తీవ్రంగా ఎండ.. సాయంత్రం వేళ ఈదురు గాలులతో వర్షం పడడాన్ని సంవాహన వర్షపాతానికి సంబంధించిందిగా నిపుణులు చెబుతున్నారు. వీటి వల్ల ఒక్కోసారి అధిక నష్టం కలిగే అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు తెలియజేశారు.
ఇవీ చదవండి: