Nude Video Call Cyber Fraud In Hyderabad : వీడియో కాల్ చేసి, అందులో నగ్నంగా కనిపించి, ఆ స్క్రీన్ షాట్లు తీసుకుని బెదిరించి డబ్బులు వసూలు చేయడం లాంటి మోసాలు ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయాయి. ఇలాంటి వీడియో కాల్స్‌తో సైబర్ నేరగాళ్లు అమాయకుల డబ్బులు దోచుకుంటున్నారు. తాజాగా ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థికి ఇలాంటి కాల్ చేసి డబ్బులు దండుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, ఆదిలాబాద్ సంజయ్‌నగర్‌కు చెందిన ఓ విద్యార్థి (22) ఘట్‌కేసర్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. దగ్గరలో ఉన్న చౌదరిగూడ మల్లమ్మ కాలనీలో అద్దెకు ఉంటున్నాడు. గురువారం రాత్రి అతని మొబైల్ వాట్సాప్‌కు దీక్షికా అగర్వాల్ అనే పేరిట వీడియో కాల్ వచ్చింది. ఎవరో అని విద్యార్థి కాల్ లిఫ్ట్ చేశాడు. వెంటనే కాల్ చేసిన అమ్మాయి మాట్లాడుతూ ఎలా ఉన్నారు? బాగున్నావా? అని అడిగింది. ఎలా చదువుతున్నావు? పరీక్షలు ఎప్పుడు? అంటూ కుశల ప్రశ్నలు అడిగింది. ఆమె అడిగిన ప్రశ్నలకు ఆ విద్యార్థి సమాధానం చెప్పాడు. అలా మాట్లాడుతూ ఉండగానే ఆమె ఒక్కసారిగా నగ్నంగా మారింది.
ఆ వీడియోను మొత్తం రికార్డు చేసింది. ఆ తర్వాత కాల్ కట్ చేసి కొన్ని నిమిషాల తర్వాత విద్యార్థికి నగ్నంగా ఉన్న వీడియోను పంపించి డబ్బులు కావాలని డిమాండ్ చేసింది. ఇవ్వకపోతే కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నగ్నంగా ఉన్న వీడియో పంపిస్తానని బెదిరించింది. దీంతో భయపడి 3 విడతలుగా రూ.20 వేలు ఆన్‌లైన్‌లో పంపించాడు. మరిన్ని డబ్బులు కావాలని బెదిరించడంతో భయపడిపోయిన విద్యార్థి, పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఎన్నో రకాల సైబర్ మోసాలు : ఎన్నో రకాలుగా మోసం చేయడానికి సైబర్ కేటుగాళ్లు వెనకాడడం లేదు. అమాయకులను వలలో వేసుకొని వీడియో కాల్స్ చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. మీ పేరు మీద డ్రగ్స్ పార్సిల్ వచ్చిందంటూ, మీరు మనీలాండరింగ్ కేసులో ఉన్నారంటూ భయాందోళనకు గురి చేసి రూ.లక్షల్లో దోచుకుంటున్నారు. ఇలాంటి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలుపుతున్నారు. అపరిచితుల వీడియో కాల్స్ మాట్లాడవద్దని సూచిస్తున్నారు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే వెంటనే 1930కి కాల్ చేయాలని తెలిపారు.
వలపు వల విసురుతారు - చిక్కితే జేబు గుళ్ల చేస్తారు - ఇదొక కొత్త తరహా మోసం
మీకూ అర్ధరాత్రి న్యూడ్ వీడియో కాల్ వస్తున్నాయా? - అయితే జాగ్రత్త పడండి