Ponguleti Srinivas Reddy fires on State Government : తెలంగాణ సాధించుకొని తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదో సంవత్సరంలోకి అడుగు పెట్టామని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. కానీ ఏ తెలంగాణ వస్తే ప్రజల బతుకులు మారుతాయని కలలు కన్నామో.. ఆ కలలు కలలుగానే మిగిలిపోయాని విమర్శించారు. మహబూబాబాద్ జిల్లాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో.. ప్రభుత్వానికి కనబడటం లేదా అని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నించారు. కర్షకులు మండుటెండలో వారు పండించిన పంటను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారని పేర్కొన్నారు. కానీ రాష్ట్ర సర్కార్ మాత్రం అన్నదాతలను అసలు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. గత రెండు ఎన్నికల మ్యానిఫెస్టోలో రైతులకు రుణ మాఫీ చేస్తామని చెప్పి మాట తప్పారని శ్రీనివాస్‌రెడ్డి దుయ్యబట్టారు.
- గొప్పల కోసం తప్ప.. తెలంగాణ బిడ్డల కోసం మీరు ఆలోచిస్తున్నారా: పొంగులేటి
- 'మాటలతో మాయ చేస్తున్నారు.. బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది'
Ponguleti on farmers Problems : గత ప్రభుత్వాలు అన్నదాతలకు సబ్సిడీలు ఇచ్చి ఆదుకున్నాయని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గుర్తుచేశారు. కేవలం రైతు బంధు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం తప్ప.. కర్షకులకు చేసింది శూన్యమని ఆక్షేపించారు. కౌలు రైతులను ఆదుకునే పరిస్థితి కరువైందని మండిపడ్డారు. గొప్ప రైతును అని చెప్పుకునే కేసీఆర్.. ఎన్నికల స్టంట్తో కాకుండా రైతులను చిత్తశుద్ధితో ఆదుకోవాలని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు .
పరిహారం డబ్బులు ఏవి? : ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడానికే.. రాష్ట్రంలో రైతు దినోత్సవం పేరిట హడావుడి చేస్తున్నారని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. 21 రోజుల పాటు తెలంగాణ ఆవిర్భావాన్ని అట్టహాసంగా నిర్వహిస్తున్నామని చెప్పుకునే సర్కార్.. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు. అన్నదాతలకు ఎకరాకు రూ.10,000 పరిహారాన్ని ఇస్తామని చెప్పి 60 రోజులు గడుస్తున్నా.. వారి ఖాతాలో నేటికీ జమ చేయలేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల హామీలను సీఎం కేసీఆర్ తుంగలో తొక్కారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి కర్షకులను ఆదుకోవాలని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.
"పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల కలలు కలలుగానే మిగిలిపోయాయి. ఎన్నికల వస్తున్నాయని తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజా ధనాన్ని విచ్చల విడిగా ఖర్చు చేస్తున్నారు. అన్నదాతలు మండుటెండలో పండించిన పంటను కాపాడుకోవాడని నానా అవస్థలు పడుతున్నారు. వారిని మాత్రం కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతులకు రుణ మాఫీ చేస్తామని చెప్పి మాట తప్పారు. గత ప్రభుత్వాలు అన్నదాతలకు సబ్సిడీలు ఇచ్చి ఆదుకున్నాయి. కేవలం రైతు బంధు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం తప్ప.. కర్షకులకు చేసింది శూన్యం. ఎన్నికల స్టంట్తో కాకుండా రైతులను చిత్తశుద్ధితో ఆదుకోవాలి." - పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాజీ ఎంపీ
ఇవీ చదవండి: