ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు విశేషంగా కృషిచేస్తున్న జిల్లాకు చెందిన చిన్నారి బెల్లం నైషా సేవలకు గుర్తింపు లభించింది. తానా పురస్కారం ఇవ్వాలని కమిటీ నిర్ణయించి ఈ మేరకు ఆహ్వానం పంపింది. ఈ విషయాన్ని ఖమ్మంలోని నైషా బంధువులు ‘ఈటీవీ భారత్కు తెలిపారు. తానా సభలు అమెరికాలో ఇవాళ్టి నుంచి జరుగనున్నాయి. ఖమ్మం నగరానికి చెందిన ప్రవాస భారతీయులు బెల్లం మధు, మాధవిల కుమార్తె నైషా ప్రస్తుతం అమెరికాలో 8వ తరగతి అభ్యసిస్తోంది. అయితే బాల్యం నుంచి ఇతరులకు సాయం చేయాలన్న ఆమె సంకల్పానికి తల్లిదండ్రులు పూర్తి సహకరించారు. అందుకనుగుణంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని వంద పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటు, వాటికి అవసరమైన పుస్తకాలను అందించారు. తన స్నేహితులతో కలిసి ఆమెరికాలో పలు కంపెనీల్లో పనిచేస్తున్న వారి నుంచి విరాళాలు సేకరించి వీటిని ఏర్పాటుచేశారు. చిరాగ్ ఫౌండేషన్ ద్వారా అమెరికా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో యూత్‌క్లబ్స్ ఏర్పాటుచేసి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సేవలను గుర్తించిన అమెరికా ప్రభుత్వం నైషాకు పలు అవార్డులను అందించింది. అమెరికా రాజకీయాలలో కీలక పాత్ర పోషించాలని, అమెరికా పార్లమెంటుకు ఎన్నిక కావాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్టు నైషా తెలిపారు. తాను సామాజిక కార్యక్రమాలు నిర్వహించేందుకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపింది.
ఇవీ చూడండి: రెండు రాష్ట్రాలు రెండేసి టీఎంసీల ప్రతిపాదన