గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. తొలుత జిల్లాలో ఉత్తమ సర్పంచ్‌గా ఎన్నికైన కొడవటి మెట్టు పంచాయతీ సర్పంచ్ బద్దం నిర్మల దంపతులను ఆయన సన్మానించారు. గ్రామాభివృద్ధికి వారు చేస్తున్న సేవలను కొనియాడారు. ప్రధానంగా పల్లె ప్రకృతి వనం రాష్ట్ర స్థాయిలో గుర్తింపు సాధించిందని ప్రశంసించారు. అదే స్ఫూర్తితో ప్రతి సర్పంచ్ పని చేయాలని సూచించారు.
గ్రామాలు ఆరోగ్యవంతంగా ఉండాలనే లక్ష్యంతో ఆహ్లాద వాతావరణం ఉండేలా పల్లె ప్రకృతి వనాన్ని సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారని అన్నారు. వైకుంఠధామం పేరుతో అంతిమ సంస్కారాలకు ఇబ్బంది లేకుండా ప్రతి గ్రామంలో శ్మశాన వాటికలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పలు గ్రామాల్లోని సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి చెక్కులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ ఛైర్మన్ రాయల వెంకట శేషగిరిరావు, ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు సొసైటీ ఛైర్మన్ రెడ్డెం వీర మోహన రెడ్డి, తెరాస ప్రధాన కార్యదర్శి దుగ్గి దేవర వెంకట లాల్, పలు గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రానికి రూ.179 కోట్లు మంజూరు చేసిన కేంద్రం