కేంద్రప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఖమ్మంలో భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తామని కాంగ్రెస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. రైతుల ఆందోళనకు మద్దతుగా ఈనెల 28న పట్టణంలో పెవిలియన్ మైదానం నుంచి ధర్నా చౌక్ వరకు ప్రదర్శన చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఏన్కూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
నెల రోజులుగా నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చట్టాలు రద్దు కోసం రైతుల ప్రాణాలు పోతున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. జిల్లాలోని అన్ని మండలాల రైతులను పెద్ద సంఖ్యలో తరలించే విధంగా జిల్లాలో పర్యటిస్తున్నట్లు దుర్గాప్రసాద్ వెల్లడించారు.