Losses to the mango farmer in khammam: గత రెండేళ్లుగా ఎదురైన ప్రతికూల ఫలితాలతో నష్టాల ఊబిలో చిక్కుకున్న మామిడి రైతులకు ఈ సారైనా సాగు లాభాల రుచి చూపిస్తుందని ఆశించినా తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్లుంది. పరిస్థితులు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో సుమారు 45వేల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. ఖమ్మం జిల్లాలో 30వేల ఎకరాలు, భద్రాద్రి జిల్లాలో 15 వేల ఎకరాల్లో రైతులు మామిడి తోటలు సాగు చేస్తున్నారు. గతేడాది నిరాశాజకమైన దిగుబడులతో సాగుదారులు నష్టాలే మూటగట్టుకున్నారు.
అంతకుముందు ఏడాది కోవిడ్‌తో మామిడికి డిమాండ్ లేక రైతులకు నష్టాలు తప్పలేదు. ఈ ఏడాది పరిస్థితి మరింత దయనీయంగా మారింది. మామడి తోటలకు తామరపురుగు, ఇతర తెగుళ్లు సోకడంతో సాగుదారులు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయారు. పూతదశను దాటి పిందె దశకు వస్తున్న మామిడి తోటలు తామర పురుగు ఉద్ధృతికి తట్టుకోలేకపోతున్నాయి. ఆశించిన మేర పూత వచ్చినప్పటికీ తామరపురుగు, ఇతర తెగుళ్లు సోకి పూత రాలిపోతుంది.
మామిడి తోటలు కాపాడుకునేందుకు సాగుదారులు అష్టకష్టాలు పడుతున్నారు. పూత దశ దాటితే కాత వచ్చే సమయంలో తామరపురుగుతోపాటు సోకుతున్న ఇతర తెగుళ్లను నివారించేందుకు ఇబ్బడిముబ్బడిగా పురుగుమందులు పిచికారి చేస్తున్నారు. ఒక్కో రైతు ఒక్కసారి మందుల పిచికారి చేస్తే సుమారు 20 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతోంది. పురుగుమందుల దుకాణాలు, ఉద్యానశాఖ అధికారులు ఎన్నిరకాల మందులు సూచించినా తెగుళ్లు నియంత్రణలోకి రావడం లేదని రైతులు వాపోతున్నారు.
ఈ పరిస్థితులతో ఈసారి దిగుబడులు మరింత పడిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఎకరాకు 10 టన్నుల వరకు మామిడి దిగిబడి రావాల్సి ఉండగా ప్రస్తుత పరిస్థితులతో కనీసం రెండు, మూడు టన్నుల మామిడి దిగుబడి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యానశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు తోటలు పరిశీలించి సలహాలు, సూచనలు ఇస్తే కాసింతైనా గట్టెక్కుతామని మామిడి సాగుదారులు చెబుతున్నారు.
మామిడి తోటలకు తామర పురుగు బెడద ఉందని మిర్చి పంటలకు సోకినట్లే ప్రస్తుతం మామిడి తోటలకు తామర పురుగు సోకుకుందని ఉద్యాన అధికారులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పూత ఎండిపోవడం, పిందె రాలిపోవడం, కాయ పగులుడు నివారణకు ఒక గ్రాము జింక్ సల్ఫేట్ ఒక గ్రాము బోరాన్ లీటర్ నీటితో కలిపి పూమొగ్గ పెరుగుదశలో ఉన్నప్పుడు చెట్లు బాగా తడిచేటట్లు పిచికారి చేయాలని అధికారులు చెబుతున్నారు. దీని ద్వారా పిందెశాతం పెరిగి కాయ పగులుడు నివారిస్తుందంటున్నారు. పూత, పిందె దశలో ఆకుమచ్చ వ్యాప్తి నివారణకు లీటరు నీటికి గ్రాము కార్బండా జిమ్ కలిపి పిచికారి చేయాలని రైతులకు సలహాలు ఇస్తున్నారు.
ఇవీ చదవండి: