కొవిడ్ నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని... బాధ్యతగా విధులు నిర్వహించాలని ఖమ్మం జిల్లా పాలనాధికారి ఆర్వీ కర్ణన్ జిల్లా అధికారులను ఆదేశించారు. ఏన్కూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఆసుపత్రిలో నిర్వహిస్తున్న కరోనా పరీక్షల వివరాలు, కేసుల సంఖ్య గురించి అడిగి తెలుసుకున్నారు. ఇంటింటి సర్వే నిర్వహించి అనుమానితులను పరీక్షించాలని ఆశా కార్యకర్తలకు సూచించారు.
ఖమ్మం నుంచి వచ్చే సమయంలో ఏన్కూరు ప్రధాన కూడళ్లలో చాలామంది మాస్కులు లేకుండా తిరగడం గమనించిన కలెక్టర్... మండల అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. నిబంధనలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రజలు కరోనా నిబంధనలు పాటించేలా కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. అనంతరం కస్తూర్భా గాంధీ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. కరోనా బాధితులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కాసీం, ఎంపీడీవో అశోక్, వైద్యాధికారి అల్తాఫ్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: Etala: 'హుజూరాబాద్‌లో కౌరవులు, పాండవులకు మధ్య యుద్ధం'