వర్షాన్ని నమ్ముకున్న రైతన్న మోములో నవ్వు కరవైంది. విత్తనాలు సిద్ధం చేసుకుని వర్షాలు పడేముందు పంట వేద్దామనుకుంటే వరుణుడు కనికరించట్లేదు. తెలంగాణలో అత్యధిక లోటు వర్షపాతం ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోనే ఉంది. ప్రస్తుతం రైతులు సాధారణ సాగుకంటే చాలా తక్కువ విస్తీర్ణంలో పంటలు సాగుచేశారు. వేసిన విత్తనాలను కాపాడుకునేందుకు రైతులు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. పొడి దుక్కిలో పెట్టిన విత్తనాలను చీమలు, పురుగులు తినగా, మిగతావి సరైన పదును లేక మట్టిపాలయ్యాయి.
తొలకరి వర్షం పడగానే ఎక్కువ మంది రైతులు పత్తి, పెసర, ఇతర పప్పుధాన్యాల పంటలను సాగు చేస్తారు. ప్రస్తుతం ఉభయ జిల్లాల్లో పూర్తి స్థాయిలో సాగులోకి రాలేదు. వర్షం సకాలంలో రాకపోవడం వల్ల పత్తి విత్తనాలు కేవలం 40 శాతం మాత్రమే మొలకెత్తాయి. విత్తనాలను పొడి దుక్కిలో వేయడం వల్ల చీమలు, పురుగులకు మేతగా మారాయి. మరికొన్ని సరైన పదును లేక మొలక వచ్చి ఎండిపోయాయి.
రైతులపై అదనపు భారం
పత్తి విత్తనాలను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. పైపులు కొనుగోలు, మోటార్లను అద్దెకు తీసుకుని నీటి తడులు ఇవ్వడం వంటి పనులతో యత్నిస్తున్నారు. కిలోమీటర్ల దూరం పైపులు వేసి నీటిని తీసుకొచ్చి మొక్కల దగ్గర పోస్తున్నారు. మోటారు అద్దెకు తీసుకున్నందుకు రూ.వెయ్యి, కిరోసిన్, డీజిల్‌కు సుమారు రూ.500 వరకు ఖర్చుచేస్తున్నారు. మరోవైపు మార్కెట్‌లో పైపులను కొనుగోలు చేసే రైతుల సంఖ్య అమాంతం పెరిగింది.
నష్టం జరిగాక..
గత రెండు రోజులుగా ఉభయ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడుతున్నాయి.. అయితే జరగాల్సిన నష్టం జరిగాక ఇప్పుడు వర్షాలు పడటం వల్ల విత్తన మొలక పరంగా లాభం ఉండదని రైతులు వాపోతున్నారు. 60 శాతం విత్తనాలు మట్టిపాలయ్యాక, ఇప్పుడు జల్లులు పడిన లాభం లేదు. ఒక వేళ మళ్లీ విత్తనాలు పెడితే ముందుగా వేసిన పంటకు, ఇప్పుడు వేసిన విత్తనాలకు మధ్య వ్యవధి నెల రోజుల వరకు ఉంటుంది.
ఇవీ చూడండి: గురువుల పండుగ గురుపౌర్ణమి