Minister Chance in Khammam District Leaders 2023 : ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో ప్రభంజనం సృష్టించిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సారథ్యంలో ఖమ్మం జిల్లా నుంచి కేబినెట్ బెర్తు ఎవరికి దక్కుతుందన్నఅంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. సీనియర్ నాయకుడిగా, పార్టీకి వెన్నుదన్నుగా మల్లు భట్టివిక్రమార్క నిలిస్తే జిల్లా రాజకీయాల్లో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలందిస్తూ అభివృద్ధి మాంత్రికుడిగా తుమ్మల నాగేశ్వరరావు పేరొందారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే అందరి నాయకులను కలుపుకుపోయి ప్రజల్లో ఆదరణ దక్కించుకుంటూ ఖమ్మం జిల్లాలో అత్యధిక స్థానాలు గెలవటంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలకంగా వ్యవహరించారు. త్వరలో కొలువుదీరబోయే మంత్రివర్గంలో ఈ ముగ్గురిలో ఎవరెవరికి ఏ స్థానం లభిస్తుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది.
Who Will Become Minister From Khammam District : రాష్ట్ర కాంగ్రెస్‌లో కీలక నేత మల్లు భట్టివిక్రమార్కకు మంత్రివర్గంలో సముచితస్థానం దక్కటం ఖాయంగానే కనిపిస్తోంది. మధిర నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు గెలుపొందారు. మొదటి నుంచి కాంగ్రెస్‌లోనే ఉంటూ భట్టివిక్రమార్క పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఒకసారి ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వర్తించారు.
శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి కాంగ్రెస్‌కు ఊపు తీసుకొచ్చారు. సీఎల్పీ నేతగా శాసనసభలో ప్రజల తరపున మాట్లాడి అధిష్ఠానం వద్ద ప్రత్యేక గుర్తింపు పొందారు. కాంగ్రెస్ పార్టీ గెలవడంలో తనవంతు పాత్ర పోషించడంతో కొలువుదీరబోయే మంత్రివర్గంలో విక్రమార్కకు కీలక పదవి దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భారీ బందోబస్తు - ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కసరత్తు
తుమ్మల నాగేశ్వరరావు : ఉమ్మడి, స్వరాష్ట్ర మంత్రి వర్గాల్లో సుమారు 17 ఏళ్లకు పైగా మంత్రిగా పనిచేసి కాంగ్రెస్‌లో చేరి ఆరోసారి ఖమ్మం నుంచి గెలిచిన తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందన్న ప్రచారం సాగుతోంది. రేవంత్‌రెడ్డి ఆహ్వానంతో కాంగ్రెస్‌లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు.. ఖమ్మంలో పువ్వాడ అజయ్‌పై గెలుపొందారు.
తెలంగాణ కాంగ్రెస్‌కు టీడీపీ మద్దతు కూడగట్టడంలో కీలక పాత్ర పోషించి.. కాంగ్రెస్ విజయానికి బాటలు వేయడం, మంత్రిగా ఆయనకున్న సుదీర్ఘ అనుభవం లాంటివి తుమ్మలకు కలిసొచ్చే అవకాశంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన తుమ్మల ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ ప్రభుత్వాల్లో మంత్రిగా సేవలందించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అత్యధిక కాలం మంత్రిగా పనిచేయటం, పాలనలో అపార అనుభవం కలిగి ఉండటం, సామాజికవర్గ సమీకరణాలు తుమ్మలకు కలిసొస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణలో కొత్త సర్కార్ - ప్రభుత్వ అధికారుల పోస్టింగులపై చర్చ - డీజీపీ నుంచి సీఐ వరకు బదిలీలు!
పొంగులేటి శ్రీనివాసరెడ్డి : అసెంబ్లీ ఎన్నికల బరిలో తొలిసారి నిలిచిన పొంగులేటి పాలేరు నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. దీంతో మంత్రివర్గ రేసులో ఆయన పేరుకూడా గట్టిగా వినబడుతుంది. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి ఉభయ జిల్లాల్లో ఆపార్టీకి జవసత్వాలు నింపిన నాయకుడిగా గుర్తింపు పొందారు. ప్రజాబలం కలిగిన నాయకుడిగా ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల పక్షాన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. జిల్లాలో అత్యధిక స్థానాలు గెలవడంలో ముఖ్యపాత్ర పోషించారు.
రేవంత్‌తో పాటు, కాంగ్రెస్ పెద్ద నాయకులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటం, పార్టీకి ఆర్థికంగా అండదండలు అందించటం, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో తన అనుచరులందరినీ గెలుపించుకోవటం ఆయనకు సానుకూలంగా మారుతాయనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఒకే జిల్లా నుంచి ముగ్గురు కీలక నేతలకు అవకాశం దక్కుతుందన్న వార్తల నేపథ్యంలో అధిష్ఠాన నిర్ణయంపై అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది.
తెలంగాణ కొత్త సీఎం అనుముల రేవంత్ రెడ్డి - జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రస్థానం సాగిందిలా
'ఇండియా' కూటమి భేటీకి కీలక నేతలు డుమ్మా- నష్టనివారణలో కాంగ్రెస్!