ఖమ్మం జిల్లాకు చెందిన యువకులు మిసైల్ మ్యాన్ హెల్పింగ్ హ్యాండ్స్’ అనే సంస్థను స్థాపించారు. 2015లో బోనకల్లు మండలం గోవిందాపురానికి చెందిన వి.నరేశ్ తన మిత్రులు తిరుమలేశ్, కేఆర్‌జీ శివకృష్ణ, కావడి సురేశ్‌తో సంస్థ మొదలైంది. ఇప్పుడు 130మంది సభ్యులతో సంస్థ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలకు చెందిన వారు సభ్యులుగా ఉన్నారు.
తెలంగాణలో అన్ని జిల్లాల నుంచి సభ్యులు తమ సహాయ సహకారాలు అందిస్తున్నారు. వీరితో పాటు అమెరికాలో ఉన్న ఎన్‌ఆర్‌ఐ మల్లెల లక్ష్మీనారాయణ, గోళ్ల సైదులు కూడా సంస్థకు ఇతోధికంగా సాయం చేస్తున్నారు. సంస్థలోని సభ్యులు ప్రతి నెలా తమ వేతనం నుంచి 5 శాతం సంస్థకు విరాళంగా ఇస్తున్నారు. సంస్థలోని సభ్యులు బ్యాంకులు, రైల్వే, పోలీసు, రెవెన్యూ, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రతి రూపాయిని నిజాయితీతో ఖర్చు చేస్తున్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోనున్న 2020 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా చేయటం అబ్దుల్ కలాం కల. ఆయన కలల్ని నిజం చేసేందుకు ప్రధానంగా యువత దేశప్రజలంతా ఒక్కో అడుగు ముందుకేసి సమష్టిగా కృషి చేయాలని సంస్థ కోరుకుంటోంది.
అసహాయులకు ఆర్థిక చేయూత
రోడ్డు ప్రమాదంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లికి చెందిన అనిల్ వైద్యఖర్చుల నిమిత్తం రూ.1.10లక్షలు అందజేశారు. ఖమ్మం జిల్లా పాలడుగుకు చెందిన చిన్నారి శ్రీజ కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా రూ.50వేలు అందజేశారు. శస్త్రచికిత్స చేయగా ప్రస్తుతం కోలుకుంటోంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సాయిరాం(గోవిందాపురం) రూ.25వేలు, సుజాత(జానకీపురం) రూ.12వేలు, వెంకటనారాయణ(ముష్టికుంట్ల) రూ.10వేలు, ఫణికుమార్(ముష్టికుంట్ల) రూ.10వేలు, స్వాతి(రాయిగూడెం) రూ.40వేలు అందజేశారు. పుల్వామా సీఆర్‌పీఎఫ్ జవాన్లకు, కేరళ వరద బాధితులకు రూ.5వేల చొప్పున విరాళాలు అందజేశారు. తలసేమియా పిల్లలకు చేయూతనందిస్తున్న సంకల్ప ఫౌండేషన్‌కు రూ.20వేలు అందించారు. దివ్యాంగుడు బత్తుల యల్లయ్య(తిమ్మారావుపేట)కు రూ.30వేలు కిరాణా దుకాణం కోసం అందించారు.
రేపటి పౌరుల కోసం
ముదిగొండ మండలం పండ్రేగుపల్లి జడ్పీఎస్ పాఠశాలను దత్తత తీసుకుని రూ.30వేలతో కలాం గ్రంథాలయం, రూ.30వేలతో శుద్ధిజల ప్లాంటు ఏర్పాటు చేశారు. ఖమ్మం పెద్దతండా మేఫి అనాథ శరణాలయం పిల్లలకు వంట సరకులు, మంచిర్యాల జిల్లా ఐబీ తాండూర్‌లో అమ్మఒడి అనాథ శరణాలయం చిన్నారులకు రూ.18వేలతో ఉపకరణాలు, కూసుమంచి హట్యాతండా పాఠశాల విద్యార్థులకు రూ.15వేల పుస్తకాలను అందజేశారు. తలసేమియా పిల్లల కోసం చింతకాని, తల్లాడ మండలాల్లో 123 యూనిట్ల రక్తం సేకరించారు. ‘ఎంఎంహెచ్ ప్రాణదాత’ అనే వాట్సాప్ గ్రూపు ద్వారా జిల్లాలోని ప్రజలకు రక్తదానం చేస్తున్నారు.
ఇదీ చూడండి : నిద్రావస్థలో తూనికల శాఖ... దోచేస్తున్న వ్యాపార దళం