సుబాబుల్, జామాయిల్ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ భద్రాద్రి జిల్లా సారపాక ఐటీసీ ఎదుట నిర్వహిస్తున్న ధర్నాకు వెళ్తున్న రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోని అన్నదాతలనుఅరెస్టు చేశారు.
టన్నుకు రూ. 4500 గిట్టుబాటు ధర కల్పించటమే కాకుండా... రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. తమ విన్నపాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్వహించ తలపెట్టిన ధర్నాను పోలీసులు భగ్నం చేశారు. ఆయా మండలాల్లో ఆ సంఘం నాయకులు రైతులను సన్నద్ధం చేశారు. గ్రామాల నుంచి ఆందోళనకు తరలి వెళ్తున్న రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మధిర, ఎర్రుపాలెం, బోనకల్, ఏన్కూరు, రఘునాథపాలెంతో పాటు చాలాచోట్ల రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం వెళ్తున్న రైతులను నిర్బంధించడం దారుణమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.