ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం బురద రాఘవాపురం పంటపొలాల్లో చిరుతపులి ఆకారం కనిపించడంతో రైతులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు జంతువు పాదముద్రలను సేకరించారు. మిర్చిపంటకు నీళ్లు పెట్టేందుకు రైతులు పొలానికి వెళ్లిన సమయంలో సుబాబుల్ తోటలో కనిపించిందని తెలిపారు.
అటవీశాఖ అధికారి వీరభద్రం సిబ్బందితో కలిసి పాదముద్రలను పరిశీలించారు. అయితే అది చిరుతుపులి కాదని తేల్చారు. అదే ఆకారంలో ఉండే హైనా జంతువుగా గుర్తించారు. పెద్దపులులు, చిరుతలు వదిలేసిన మాంసాన్ని ఈ జంతువు తింటుందని ఆయన తెలిపారు. హైనాను గుర్తించేందుకు చుట్టుపక్కల పొలాల్లో, అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వీరభద్రం వెల్లడించారు.