ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి గణపేశ్వరాలయం ఎంతో ప్రత్యేకం. కాకతీయుల కాలంలో నిర్మించిన పురాతన ఆలయాల్లో ఇది కూడా ఒకటి. ఓరుగల్లును పాలించిన ప్రతాపరుద్రుని కాలంలో ఈ దేవాలయ నిర్మాణం జరిగిందని చరిత్ర చెబుతోంది. నిర్మాణంలో వరంగల్ వెయ్యి స్తంభాల గుడిని పోలి ఉంటుంది. శిల్పకళ నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచిన ఈ ఆలయం సుమారు ఒక ఎకరం విస్తీర్ణంలో లింగాకారంలో రూపుదిద్దుకుంది. గర్భగుడిలోని శివలింగం ఆరడుగుల ఎత్తు, అంతే వెడల్పుతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
పాలకుల చొరవతో అభివృద్ధి..
శతాబ్దం క్రితం వరకు శిధిలావస్థలో ఉన్న ఆలయానికి ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయడంతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందింది. ఏటా శివరాత్రి సందర్భంగా సర్వదర్శనానికి భక్తులు వేలాదిగా వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సుమారు రూ.ఎనిమిది లక్షలు వెచ్చించి పార్కు అభివృద్ధితోపాటు, భక్తులకు వసతి గదులు కూడా ఏర్పాటు చేశారు.
కోరిన కోర్కెలు తీర్చే దేవుడు..
కోరిన కోర్కెలు తీరుతాయనే నమ్మకంతో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి విచ్చేస్తారు. మహాశివరాత్రి నేపథ్యంలో రెవెన్యూ, గ్రామపంచాయతీ, పాలకొల్లు పోలీసుల సమన్వయంతో ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. పూలమాలలతో గుడిని అలంకరిస్తున్నారు. భక్తులకు దర్శనం కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు.
ఇవీ చూడండి: అక్కడ డబ్బులు ఉతికేస్తున్నారు