Congress Khammam MLA Tickets Issue : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాల్లో తొలి దఫాలో ఇద్దరు అభ్యర్థులను మాత్రమే కాంగ్రెస్ ప్రకటించింది. సిట్టింగ్ స్థానాలైన మధిర, భద్రాచలం నుంచి సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, పొదెం వీరయ్య అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. మిగిలిన 8 చోట్ల అభ్యర్థులను ప్రకటించలేదు. తొలి దఫాలో 55 మందిని ఖరారు చేసిన పార్టీ.. దాదాపు అసమ్మతులు లేని, ఆశావహుల పోటీ తక్కువగా ఉన్న చోట టికెట్లు ఖరారు చేసింది. పార్టీ అంతర్గత సర్వేల్లో ఒక్కరికి పూర్తిగా సానుకూలంగా తేలిన నియోజకవర్గాల్లోనే అభ్యర్థులను ప్రకటించినట్లు స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ ప్రకటించారు.
Congress Focus on Khammam MLA Tickets : మిగిలిన చోట్ల ఆచితూచి, ఆందరికీ ఆమోదయోగ్యమైన వారిని రంగంలోకి దించుతామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు టికెట్లు ఖరారు కాని 8 నియోజకవర్గాల నుంచి రేసు గుర్రాలెవరో తేలాల్సి ఉంది. మాజీ మంత్రి తుమ్మల, కాంగ్రెస్ ప్రచార కమిటీ కో-ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పోటీచేసే స్థానాలపై స్పష్టత వచ్చినట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. ఖమ్మంలో తుమ్మల, పాలేరు నుంచి పొంగులేటి బరిలో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఐనా ఇద్దరి అభ్యర్థిత్వాలు తొలి జాబితాలో లేకపోవడం శ్రేణుల్ని విస్మయానికి గురి చేసింది.
Congress Khammam MLA Tickets 2023 : వ్యూహాత్మకంగానే తొలి జాబితా(First List)లో ఇద్దరి అభ్యర్థిత్వాలు ప్రకటించలేదని పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. రెండు చోట్ల ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన నాయకులను బుజ్జగించిన తర్వాతే.. వారి పేర్లు ప్రకటించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. మిగిలిన 6 నియోజకవర్గాల్లో మాత్రం అభ్యర్థుల ఖరారు కాంగ్రెస్‌కి సవాల్‌గా మారినట్లు ప్రచారం సాగుతోంది. ప్రధానంగా ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరేసి ఆశావహ అభ్యర్థుల పేర్లు కేంద్ర ఎన్నికల కమిటీకి చేరినా.. మిగిలిన వారూ సీటు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సత్తుపల్లి నుంచి ఏకంగా ఐదుగురు ఆశావహుల మధ్య పోటాపోటీ నెలకొంది.
Telangana Congress MLA Ticket Issues 2023 : ఇల్లందు, పినపాక, అశ్వారావుపేటలో టికెట్ పోరు తారాస్థాయికి చేరింది. కొత్తగూడెం, వైరా నియోజకవర్గాల్లోనూ ఆశావహులు పోటాపోటీ ఉంటే కమ్యూనిస్టులతో పొత్తులు కాంగ్రెస్(Congress)కి ఎసరు పెట్టేలా ఉన్నాయన్న ఆందోళన.. ఆశావహుల్లో వ్యక్తమవుతోంది. పొత్తులో భాగంగా కొత్తగూడెం సీపీఐకి కేటాయించడం ఖాయంగా కనిపిస్తోంది. జిల్లా నుంచే సీపీఎంకి ఒక స్థానం ఇవ్వాల్సి వస్తుండటంతో.. ఎక్కడ ఇవ్వాలన్న అంశంపై కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతోంది.
ఇటీవల చోటు చేసుకుంటున్న రాజకీయ సమీకరణాలు పలు నియోజకవర్గాలకు చెందిన ముఖ్యనేతలు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టత, పార్టీ అభివృద్ధి కోసం, కార్యకర్తల కోసం పనిచేసిన నాయకులు.. కొత్త నేతల రాకతో రగిలిపోతున్నారు. ముఖ్యంగా ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం నియోజకవర్గాల నుంచి టికెట్ ఆశించిన నాయకులు ఇటీవల ప్రత్యేకంగా సమావేశమై చర్చించడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
పార్టీలో పరిస్థితిపై పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కష్టకాలంలో పార్టీని బతికించడమే కాకుండా.. కార్యకర్తలకు ఏళ్లుగా అండదండలు అందించిన తమను పక్కనబెట్టి కొత్తగా పార్టీలో చేరిన నాయకులకు టికెట్లు దక్కుతున్నాయన్న ప్రచారం సాగడంపై వారు రగిలిపోతున్నారు. ఇవాళ ఖమ్మం(Khammam) వెళ్లనున్న భట్టి విక్రమార్కతో ప్రత్యేక భేటీకి కాంగ్రెస్ ముఖ్య నేతలు సన్నద్ధమవుతుండటం.. పార్టీవర్గాల్లో చర్చకు దారితీస్తోంది. పలు నియోజకవర్గాల్లో అసంతృప్తితో ఉన్న నాయకులను.. సంప్రదించేందుకు బీఆర్ఎస్ ముఖ్యనేతలు రంగంలోకి దిగడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
Telangana Congress Bus Yatra 2023 : ఈనెల 18 నుంచి కాంగ్రెస్ బస్సు యాత్ర.. కొండగట్టు నుంచి ప్రారంభం