ఖమ్మం జిల్లాలో పలుచోట్ల ఊహించని రీతిలో కురిసిన అకాల వర్షం రైతులకు అపార నష్టం మిగిల్చింది. ముఖ్యంగా ఖమ్మం నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో దాదాపు గంట పాటు కురిసిన వాన.. మిర్చి రైతులను ముంచింది. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో పలు మార్కెట్ యార్డులు, రైతుల కల్లాల్లోని పంట పూర్తిగా నీటిపాలైంది. ఖమ్మం, వైరా, ఏన్కూరు మార్కెట్ యార్డుల్లో కురిసిన వర్షానికి రైతులు ఉరుకులు పరుగులు పెట్టారు. రాష్ట్రంలోనే అత్యధికంగా మిర్చి తరలివచ్చే మార్కెట్లో ఒకటైన ఖమ్మం మిర్చి విపణికి దాదాపు నెల రోజులుగా భారీగా పత్తి తరలివస్తోంది. గతంలో పోలిస్తే ఈసారి ధరలు కూడా రైతులు ఆశించిన స్థాయిలోనే పలుకుతుండటం వారికి ఆనందాన్ని కలిగించింది.
మంచి ధర పలుకుతున్న సమయంలో..
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే కాకుండా మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నుంచి కూడా మిర్చిని రైతులు తీసుకొస్తున్నారు. గరిష్ఠంగా రూ.14,500 వరకు క్వింటా మిర్చి ధర పలుకుతుండగా... కనిష్ఠంగా రూ.13 వేల వరకు పలుకుతోంది. పంటను అమ్ముకునేందుకు ఇవాళ కూడా రైతులు భారీగా తరలివచ్చారు. మార్కెట్లోని షెడ్లలో అప్పటికే భారీగా మిర్చి నిల్వలు పేరుకుపోవడం వల్ల చేసేదేమీలేక బయటనే నిల్వచేశారు. ఈ సమయంలో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం రైతుల్ని అతలాకుతలం చేసింది.
కవర్లు కప్పేలోపే..
ఇవాళ ఒక్కరోజే దాదాపు 30 నుంచి 40 వేల వరకు బస్తాలు మార్కెట్కు రాగా వాటిలో దాదాపు సగానికిపైగా మిర్చి బస్తాలు వర్షానికి తడిసిపోయి రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. రైతు తేరుకుని మిర్చి బస్తాలపై కవర్లు కప్పేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వైరా, ఏన్కూరు, తల్లాడ మార్కెట్ యార్డుల్లోనూ.. మిర్చి, పత్తి, కంది రైతులకు ఇబ్బందులు తప్పలేదు.
ప్రభుత్వమే ఆదుకోవాలి..
ఖమ్మం మిర్చి మార్కెట్లో తడిసిన మిర్చి బస్తాలను మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్ పరిశీలించారు. రైతులకు నష్టం జరగకుండా చూస్తామని చెప్పిన ఆయన... శనివారం మార్కెట్కు సెలవు అయినప్పటికీ.... కొనుగోళ్లు జరుపుతామని తెలిపారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.