Check Dam Fail: ఖమ్మం గ్రామీణం మండలంలోని తనగంపాడు-గూడురుపాడు మధ్య నిర్మించిన నూతనంగా చెక్ డ్యామ్ రైతులకు శాపంగా మారింది. ఆకేరు నుంచి వచ్చే వరద నీటిని ఒడిసిపట్టి నిల్వ చేయడంతోపాటు, స్థానికులకు సాగు నీరు అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం చెక్ డ్యామ్ నిర్మించింది. 2020లో చెక్ డ్యామ్ మంజూరు అయ్యింది. అధికారులు ప్రతిపాదించిన చోట చెక్ డ్యామ్ వద్దంటే వద్దని రైతులు వ్యతిరేకించారు. ప్రస్తుతం నిర్మించిన చోట నీటి నిల్వసామర్థ్యం లేదని, ఉపయోగకరంగా ఉండదన్నారు. దీంతో ఏడాది ఆలస్యమయ్యింది. అయినా అధికారులు మొండిగా వ్యవహరించటంతో రెండేళ్ల తర్వాత నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం వరద ధాటికి చెక్ డ్యామ్ తేలిపోయింది.
పాలేరు ఎమ్మెల్యేగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్న సమయంలోనే చెక్ డ్యామ్ నిర్మాణానికి బీజం పడింది. స్థానికులు, రైతులు ప్రతిపాదించిన చోట చెక్ డ్యామ్ నిర్మించాలని నిర్ణయించారు. 4.29 కోట్లు కేటాయించి సాగుకు దన్నుగా ఉంటుందనుకుంటే కొందరి స్వార్థం రైతుల పాలిట శాపంగా మారింది. ఆకేరు వరద ఉద్ధృతిని అంచనా వేసి చెక్ డ్యామ్ నిర్మాణం చేపట్టాల్సి ఉన్నా.. కొందరు రాజకీయ నాయకుల స్వార్థం, గుత్తేదారుల కోసం మరో చోట చేపట్టడంతో తొలి వరదకే ఇంజినీరింగ్ లోపాలు కొట్టొచ్చినట్టు బయటపడ్డాయి. చెక్ డ్యామ్ వద్ద వరద నీరు నిలవాలి లేదా దానిపై నుంచి ప్రవహించాల్సి ఉన్నా అలా జరగడం లేదు. నీళ్లు పక్కదారి పట్టి చెక్ డ్యామ్ పక్కనుంచి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా కొంతమంది రైతుల పొలాలు నీట మునిగాయి.
ఇంజినీరింగ్ లోపం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మామూళ్ల మత్తులోపడి స్థానిక రాజకీయనేతలు, గుత్తేదారులు చెప్పినట్లు విని అక్కడే చెక్ డ్యామ్ నిర్మాణానికి చుట్టడం వల్లనే చెక్ డ్యామ్ ఉపయోగం లేకుండా పోతుందని అంటున్నారు. ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమండ్ చేస్తున్నారు. చెక్ డ్యామ్ వద్ద నీటిని నిలిపేందుకు అధికారులు ఏవైనా చర్యలు చేపట్టినా.. అవి తాత్కాలిక ప్రయోజనమే తప్ప..శాశ్వత ప్రయోజనం మాత్రమే కష్టమేనని ప్రస్తుత పరిస్థితితో తేటతెల్లం అవుతోంది.
ఇవీ చదవండి: రంగంలోకి మాణిక్కం ఠాగూర్.. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై ఆరా
నడిరోడ్డుపై కార్ డోర్ తెరిచి స్టంట్స్.. క్షణాల్లోనే సీన్ రివర్స్!