BJP complaint to CP: తెరాస నాయకులు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. భాజపా కార్యకర్త సాయి గణేశ్ మరణ వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకొని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి పదవికి రాజీనామా చేసి స్వచ్ఛందంగా న్యాయ విచారణ వేయించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అంతకుముందు జరిగిన ఘటనలే పోలీసుల వ్యవస్థ అధికార పార్టీ నాయకులకు తొత్తుగా మారిందనడానికి నిదర్శనమన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వీడియోల ఆధారంగా కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. కార్యకర్త సంస్మరణ సభకు జాతీయ నాయకులను ఆహ్వానిస్తామని ఆయన తెలిపారు.
సీపీకి ఫిర్యాదు: భాజపా కార్యకర్త బలవన్మరణంపై సీపీకి ఫిర్యాదు చేసినట్లు శ్రీధర్ రెడ్డి తెలిాపారు. ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కార్పొరేటర్ భర్త ప్రసన్నకృష్ణ, మూడో పట్టణ సీఐ సర్వయ్యపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సాయి మరణ వాంగ్మూలం ఆధారంగా వేధింపులకు గురి చేసిన వారిని శిక్షించాలని కోరారు. సాయిగణేశ్ అమ్మమ్మతో కలిసి మూడో పట్టణ పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు శ్రీధర్ రెడ్డి వెల్లడించారు.
భాజపా కార్యకర్త బలవన్మరణం: కేసుల పేరుతో పోలీసులు వేధిస్తున్నారంటూ ఖమ్మం భాజపాలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న సాయిగణేశ్ అనే కార్యకర్త ఈ నెల 14న పోలీస్‌స్టేషన్ ఆవరణలో పురుగులమందు తాగాడు. అతన్ని ఖమ్మం ఆస్పత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. రెండ్రోజుల పాటు చికిత్స పొందిన సాయిగణేశ్ పరిస్థితి విషమించడంతో ప్రాణాలు విడిచాడు. సాయిగణేష్ మృతితో భాజపా శ్రేణులు ఖమ్మంలో ఆందోళనకు దిగారు. తెరాసకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాయిగణేశ్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: భాజపా కార్యకర్త ఆత్మహత్య.. ఖమ్మంలో ఉద్రిక్త పరిస్థితులు.. తెరాస వేధింపులే కారణమా.?