Elagandula school problems: ఎలగందుల ఒకప్పుడు కరీంనగర్ జిల్లాకు కేంద్రంగా ఉండేది. గ్రామంలో గొప్ప చరిత్రగల ఖిల్లా కూడా ఉంది. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని పాలకులు ఎన్నో బాసలు చేశారు. ఇదే ఊరిలో గత వైభవానికి సాక్ష్యంగా నిలుస్తూ... ఉన్నత పాఠశాల కనిపిస్తుంది. కొత్తపల్లి మండల పరిధిలోని ఈ పాఠశాల భవనం.. శిథిలావస్థకు చేరుకుంది. రంగులు వెలిసిపోయి.. గోడలకు పాకురు పట్టి.. ఫ్యాన్ ఎప్పుడు ఊడిపోతుందో అనే భయం నెలకొంది. కిటికీలు ఎత్తుకెళ్లిపోగా.. మిగిలిన గోడల మధ్య విద్యార్థులు పాఠాలు నేర్చుకుంటున్నారు.
ఇదీ దుస్థితి..
Government school Dilapidated: స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జిల్లా కేంద్రంగా ఉన్నప్పుడు.. ఎలగందుల బడిలో పన్నెండో తరగతి వరకు విద్యార్థులు చదువుకునే వారు. తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి సైతం ఇక్కడే విద్యనభ్యసించారు. గ్రామానికి, పాఠశాలకు గొప్ప పేరే ఉంది కానీ. పట్టించుకొనే వారు లేక... ఎప్పుడెప్పుడు కూలిపోదామా? అని ఈ బడి ఎదురుచూస్తున్నట్లుగా ఉంది పరిస్థితి.
భయం భయం
school problems in karimnagar district: కూలడానికి సిద్దంగా ఉన్న భవనాన్ని... కూల్చివేయాలని సలహాతో పాటు.. ఉత్తర్వులు ఇచ్చారు ప్రజాప్రతినిధులు, అధికారులు. కానీ ఈ భవనాన్ని కూల్చివేస్తే విద్యార్థులు ఎక్కడ చదువుకుంటారు.. వారికి ప్రత్యామ్నాయం ఎలా అనేది మాత్రం ఆలోచించలేదనే ఆవేదన స్థానికుల్లో వ్యక్తమవువుతోంది. ఎంతో మంది పేదపిల్లలు చదవుతున్నఈ బడికి పంపాలంటే... తల్లిదండ్రులకు సైతం భయం వెంటాడుతోంది. దాదాపు 250మందికిపైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలో అడుగు పెట్టాలంటే.. గుండె దడే అంటున్నారు ఉపాధ్యాయులు.
పెచ్చులూడి ఎప్పుడు తలమీద పడుతుందోనని మేము భయానక పరిస్థితుల్లో తరగతులు నిర్వహిస్తున్నాం. కిటికీలు లేకపోవడం వల్ల వేరేవాళ్లు పాఠశాల గదుల్లోకి ప్రవేశించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. కొత్తభవనంలోకి మేం తొందరగా వెళ్లాలని కోరుకుంటున్నాం. ఇది పిల్లలందరి కోరిక.
-మాధవి, ఉపాధ్యాయురాలు
పెంకులు కూలడం, నెత్తి మీద పడడం, తరగతి గదుల్లోకి పాములు రావడం జరుగుతుంది. వర్షాలు వస్తే పుస్తకాలు, మేము తడుస్తున్నాము. కిటికీలు కూడా లేవు. ఫ్యాన్స్ కూడా లేవు. పాఠశాలలో సరైన వసతులు లేక చాలా ఇబ్బందిగా ఉంది. త్వరలో కొత్త భవనం రావాలని మేం కోరుకుంటున్నాం.
-విద్యార్థులు, ఎలగందుల పాఠశాల
నత్త నడకన పనులు
పాఠశాల దుస్థితితో ఇదే ప్రాంగణంలో కొత్త భవనం కోసం పనులు ప్రారంభించారు. నిధులు విడుదలలో జాప్యంతో.. పనులు నత్తతో పోటీ పడుతున్నాయి. విద్యార్థులు సమస్యలను.. దృష్టిలో పెట్టుకొని... వెంటనే నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రధానోపాధ్యాయుడు కోరుతున్నారు.
గతంలో ఉన్న ప్రధానోపాధ్యాయులు కూడా ఈ పాఠశాల శిథిలావస్థ గురించి అధికారులకు తెలియజేశారు. కొత్త భవనానికి గవర్నమెంట్ కూడా శాంక్షన్ చేసింది. కానీ నిధులు రాలేదు. అసెంబ్లీలోనూ ఈ సమస్యను గత ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి ప్రస్తావించారు. ఆ తర్వాత కొన్ని రిపోర్టులు కూడా పంపించాం. త్వరగా పనులు పూర్తిచేస్తామని కాంట్రాక్టర్ తెలియజేశారు. ఇంకా పనులు నడుస్తున్నాయి. అన్ని వసతులతో పాఠశాలకు పూర్వవైభవాన్ని తీసుకురావడానికి ఉపాధ్యాయులం మా వంతుగా కృషి చేస్తున్నాం.
-వేణుగోపాలరావు, ప్రధానోపాధ్యాయుడు
నూతన భవన నిర్మాణం త్వరగా పూర్తి చేసి.. తమ చదువులకు ఆటంకం లేకుండా చూడాలని విద్యార్థులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: Bharat Gaurav Trains : త్వరలో 'భారత్ గౌరవ్' రైళ్లు పట్టాలమీదకు..!