Karimnagar Municipality: వానాకాలం వచ్చిందంటే చాలు కరీంనగర్ వాసులు భయంభయంగా గడుపుతారు. ఎందుకంటే చిన్నాపాటి వాన పడ్డా నీరు ఇళ్లల్లోకి వచ్చేస్తాయి. ఓ మోస్తరు వర్షం కురిసినా అంతా జలమయం కావాల్సిందే. గతేడాది కురిసిన వర్షాలతో స్థానికులు నానా అవస్థలు పడ్డారు. ఎగువ నుంచి భారీగా వరద రావడం కిందికి వచ్చే సరికి కాల్వలు కుంచించుకుపోవడంతో నీళ్లన్నీ ఇళ్లలోకి పోయేవి.
దీంతో పాటు కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన రోడ్లన్నీ కోతకు గురికావడం జరిగేది. వర్షపు నీరు పోయేందుకు సరైన మార్గం లేకపోవడంతోనే ఈ దుస్థితి తలెత్తుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కరీంనగర్ నగర పాలక సంస్థ 133 కోట్లతో పనులు మొదలు పెట్టింది. 24 కిలోమీటర్ల ప్రధాన కాల్వతో పాటు మొత్తం 736 కిలోమీటర్ల కాల్వల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
అంతర్గత, ప్రధాన కాల్వలుగా విభజించి పనులు చేపడుతున్నారు. ప్రాథమిక, సెకండరీగా కాల్వల నిర్మాణం ప్రాధాన్యతను గుర్తించి నిర్మిస్తున్నారు. ప్రాథమికంగా జ్యోతినగర్, టెలిఫోన్‌కాలనీ, సప్తగిరి కాలనీ, శివనగర్, భగత్‌నగర్, తిరుమల్ నగర్, ఇందిరానగర్, ఆదర్శనగర్, ప్రవిష్ట ఏరియా నుంచి కిసాన్‌నగర్ వైపు ప్రతిపాదించి పనులు చేపడుతున్నారు. కాల్వల నిర్మాణం త్వరగా పూర్తి అయితే వాన నీరు ఎక్కడా ఆగబోదని అధికారులు చెబుతున్నారు. పనులు చేపట్టడం పట్ల ఆయా ప్రాంతాల్లోని కార్పోరేటర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కేటాయించిన నిధులతో శాశ్వత పరిష్కారం లభిస్తోందని కరీంనగర్ మేయర్ సునీల్ రావు చెప్పారు. దశలవారీగా పనులు పూర్తి చేసి రాబోయే ఐదు దశాబ్దాల వరకు నగరానికి ముంపు బాధ ఉండదన్నారు. నిధులు భారీగా విడుదలైనా వేగం, నాణ్యత అంశంపై ప్రత్యేక దృష్టి సారిస్తే నిధులకు సార్దకత చేకూరుతుందని స్థానికులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: కాలువ కింద పొలాలు.. అయినా తప్పని సాగు నీటి కష్టాలు