Modern Teaching at Karimnagar Government School : సర్కార్ ప్రభుత్వ స్కూల్లలో సరైన వసతులు ఉండవన్న అభిప్రాయాన్ని మార్చేస్తుంది. ఒకప్పుడు ప్రైవేట్ స్కూళ్ల బాట పట్టిన స్థానిక చిన్నారులను.. ప్రభుత్వ బడిలో చేరేలా కృషి చేస్తోంది. కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. మన ఊరు-మన బడి పథకంలో భాగంగా తరగతి గదిలో బోధనలోనూ సరికొత్త సౌకర్యాలను కల్పించారు. ఈసారి ఉన్నత పాఠశాలల్లో సాంకేతిక పరికరాలతో బోధిస్తున్నారు.
Telangana Mana Ooru Mana Badi Program 2023 : జిల్లాలో తొలి విడతలో మన ఊరు-మన బడి పథకంలో ఎంపికైన 213 పాఠశాలల్లో అభివృద్ధి పనులు కొనసాగుతుండగా.. పలు పాఠశాలల్లో చివరి దశకు చేరుకున్నాయి. మరికొన్నిట్లో పనులు పూర్తయ్యాయి. జిల్లాలో ఎంపిక చేసిన 94 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్‌లను ఏర్పాటు చేశారు. ఒక్కో పాఠశాలలో 8, 9, 10వ తరగతి గదుల్లో వాటిని పాఠశాలల ప్రారంభానికి ముందే నెలకొల్పడంతో.. ఉపాధ్యాయులు వాటిపైనే బోధిస్తున్నారు.
Modern Teaching in Government Schools : ఒక్కో పాఠశాలకు సుమారు 10 లక్షలతో.. 75 అంగుళాల తెర, ఓపీఎస్ మెటల్ ఫ్రేమ్, ఆన్‌లైన్ యూపీఎస్‌లు, బ్యాటరీలను సమకూర్చారు. విద్యుత్ సరఫరా లేకున్నా దాదాపు 6 గంటల పాటు బ్యాటరీల సాయంతో ఇవి పని చేస్తాయి. వైఫై సౌకర్యాన్ని కూడా కల్పించడంతో యూట్యూబ్‌తో పాటు వివిధ యాప్‌ల ద్వారా పాఠాలు చెబుతున్నారు. పాఠ్యాంశాలకు కావాల్సిన వివరాలను.. చిత్రాలు, వీడియోల రూపంలో అర్థవంతంగా ఉపాధ్యాయులు వివరిస్తున్నారు. ఈ సౌకర్యాలు కల్పించడంతో పాఠశాలల్లో హాజరు శాతంతో పాటు నూతన ప్రవేశాలు పెరిగాయని.. సుభాష్‌నగర్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు చెబుతున్నారు.
విద్యార్థులకు దృశ్యరూపంలో బోధన : గతంలో కంటే భిన్నంగా ఐఎఫ్‌పీలపై బోధన చేయడంతో పాఠ్యాంశాలను ఆసక్తిగా వింటున్నామని విద్యార్థులు చెబుతున్నారు. వీడియోలు, వివిధ రకాల చిత్రాల పాఠాలను ప్రత్యక్ష అనుభవం పొందేలా బోధన కొనసాగుతుండటంతో నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతోందంటున్నారు. దృశ్యరూపంలో పాఠాలను బోధిస్తుండటంతో చాలా బాగా అర్థమౌతోందంటున్నారు. పాఠ్యాంశంలోని అంశాలే కాకుండా వాటికి సంబంధించి అదనపు సమాచారాన్ని కూడా చూపించడంతో చదువు పట్ల ఆసక్తిగా ఉంటుందన్న విద్యార్థులు.. చిత్రాలతో పాఠాలు నేర్చుకుంటున్నందు వల్ల బాగా గుర్తుంటుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
"మన ఊరు-మన బడి పథకంలో భాగంగా సప్లై చేసిన ఈ ఐఎఫ్‌సీ ప్యానెల్స్ విద్యార్థులకు చాలా ఉపయోగకరమైనవి. దీని ద్వారా విద్యార్థులకు అర్థంకాని విషయాలను సులభంగా బోధన చేయవచ్చు. దీనికి ఇంటర్నెట్ కూడా సప్లై చేశారు. దీంతో విద్యార్థులకు ఎలాంటి విషయమైన వెతికి బోధించి వారికి అర్థమయ్యేలాగా చేప్చొచ్చు." - తిరుపతి, సుభాష్‌నగర్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు
విద్యార్థుల సంఖ్య పెరగడమే కాదు.. ఫలితాలు కూడా మెరుగ్గా : బ్లాక్‌బోర్డుపై చాక్‌పీసులతో రాయడం వాటిని డస్టర్లతో తుడిచినప్పుడు దుమ్ము కారణంగా ఉపాధ్యాయులకు ఇబ్బందులు ఏర్పడేవి. ప్రస్తుతం ఆ ఇబ్బందులు క్రమంగా తొలగిపోతున్నాయి. అర్థవంతంగా పాఠాలు బోధిస్తుండటంతో విద్యార్థుల సంఖ్య పెరగడమే కాకుండా ఫలితాలు కూడా బాగుంటాయని ఉపాధ్యాయులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: