Telugu Students in Ukraine " వైద్యవిద్య అభ్యసించేందుకు ఉక్రెయిన్‌కు వెళ్లిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే 15 మంది వివరాలు వెలుగులోకి వచ్చాయి. కరీంనగర్, జగిత్యాల జిల్లాలకు చెందిన వారి వివరాలు గురువారం తెలియగా.. శుక్రవారం పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలకు చెందిన ఇంకొంతమంది అక్కడే ఉన్నట్లు తెలిసింది. ఇప్పటివరకు మొత్తంగా 23 మంది వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వారున్నట్లు సమాచారం.
సొంతూళ్లకు తీసుకెళ్లండి..
Karimnagar Students in Ukraine : హైదరాబాద్‌లోని పలు కన్సల్టెన్సీల ద్వారా అక్కడికి వెళ్లిన వీరంతా కీవ్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో సురక్షితంగానే ఉన్నామంటూ ఎప్పటికప్పుడు వారి కుటుంబీకులకు సమాచారం చేరవేస్తున్నారు. యుద్ధ వాతావరణం వల్ల ఎదురైన పరిస్థితులను వారు ఆవేదనతో తల్లిదండ్రులకు తెలియజేస్తున్నారు. అక్కడ తమకు ఎదురవుతున్న కష్టాలను కుటుంబీకులతో చెప్పుకొంటున్నారు. తినడానికి తిండి దొరకడం కష్టమవడంతోపాటు ఏ క్షణాన ఏం జరుగుతుందోననే భయాన్ని విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత తొందరగా తమను సొంతూళ్లకు తీసుకెళ్లేలా చూడమని అక్కడి అధికారులతోపాటు ఇక్కడి ప్రభుత్వాలను వేడుకుంటున్నారు.
కీవ్ నగరానికి దూరంగా..
Indians Stuck in Ukraine : ఉక్రెయిన్ దేశంపై రష్యా యుద్ధం చేస్తుండగా అక్కడున్న భారత వైద్యవిద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. చొప్పదండి మండల పరిషత్తు సీనియర్ సహాయకులు భీôరెడ్డి నరోత్తంరెడ్డి కుమారుడు సాయిమణిదీప్‌రెడ్డి ఎంబీబీఎస్ చదివేందుకు ఉక్రెయిన్‌లోని జాఫ్రోజియా వెళ్లారు. ప్రస్తుతం యుద్ధం జరుగున్న ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరానికి తాము 800 కి.మీ దూరంలో ఉన్నట్లు తన కొడుకు చెప్పినట్లు నరోత్తంరెడ్డి వివరించారు. ఏ క్షణంలోనైనా ఇక్కడి నుంచి వెళ్లిపోయేందుకు బ్యాగులు సర్దుకోవాలని చెప్పారని, 24 గంటల్లో బస్సు ద్వారా పోలాండుకు తీసుకెళ్లి అక్కడి నుంచి స్వదేశానికి పంపిస్తామని చెప్పినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో బôకర్లలోకి వెళ్లాలని సూచించారని, తెలంగాణ రాష్ట్రం నుంచి 1500 మంది ఉంటారని చెప్పారు. ఏటీఎంల్లో డబ్బులు అయిపోయినట్లు వివరించారు. రష్యా సైన్యం జాఫ్రోజియా రాష్ట్రానికి రాకపోవడంతో కొంత ఆందోళన తగ్గిందని సాయిమణిదీప్ చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నామని నరోత్తంరెడ్డి తెలిపారు.
బిక్కుబిక్కుమంటూ..
Indians Students Stuck in Ukraine : ఉక్రెయిన్‌లోని వినిస్టియాలో కరీంనగర్ జిల్లాకు చెందిన విద్యార్థులిలా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కరీంనగర్‌కు చెందిన కొంతమంది విద్యార్థులతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారంతా ఇక్కడి వసతి గృహాల్లో ఉంటున్నారు. ఉదయం 4.30 గంటలకి సైరన్ వచ్చే సమయంలో బంకర్లలోకి పంపిస్తున్నారని చెబుతున్నారు. రాత్రంతా నిద్ర లేకుండా ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇండియాకు పంపిస్తామనేలా చెప్పడంతో అందరూ కలిసి సమీపంలోని రైల్వే స్టేషన్‌కు చేరుకోగా.. రైలు మార్గానికి కూడా అనుమతి లేదని చెప్పడంతో శుక్రవారం వీరంతా తిరిగి వారుంటున్న నివాస గదులకు వెళ్లారు. వీరిని తీసుకెళ్లిన కన్సల్టెన్సీ వాళ్లు మాత్రం ఏం భయపడొద్దని, సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్తామనే హామీ ఇస్తున్నట్లు తెలిసింది. మూడు పూటలా తినే పరిస్థితి లేదని.. విద్యుత్తు అంతరాయంతోపాటు ఇతర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గోడు వెలిబుచ్చారు. తమ కుటుంబీకులతోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు తెలిసిన వాళ్లు ఫోన్‌లో మాట్లాడుతూ ధైర్యాన్నిస్తున్నారని చెప్పారు.
సురక్షిత ప్రాంతంలోనే..
Telangana Students in Ukraine : పెద్దపల్లి సీఎస్‌ఐ చర్చి ప్రాంతంలో నివాసముండే సయ్యద్ ఖదీర్, తయ్యాతబస్సుమ్ దంపతుల పెద్ద కుమారుడు ఖలీద్ ఒమన్, ఖదీర్ సోదరి షబానా పర్వీన్, ఇసాన్ రసూల్ దంపతుల కుమార్తె ఫాతిమా సహేర్ ఉక్రెయిన్‌లోని ఇవానో యూనివర్సిటీలో వైద్య విద్య చదువుతున్నారు. ప్రస్తుతం మూడో సంవత్సరం చదువుతున్న వీరిద్దరి కుటుంబ సభ్యులు తాజా పరిణామాలతో ఆందోళన చెందుతున్నారు. ఖాలీద్, ఫాతిమా ఇవానో నగరంలోని సురక్షిత ప్రాంతంలో ఉన్నారు. అక్కడ నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా విశ్వవిద్యాలయ అధికారులు విద్యార్థులను వారిని స్వదేశం పంపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ప్రయత్నాలు ఫలించే అవకాశముందని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రతి రోజూ పిల్లలతో వీడియో కాల్ ద్వారా మాట్లాడుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
ధైర్యంగానే ఉంటున్నాం
Russia Ukraine War : "యుద్ధ వాతావరణం కనిపిస్తున్న ఇక్కడ మేం ప్రస్తుతానికి సురక్షిత ప్రదేశంలో ఉన్నాం. మా తల్లిదండ్రులతోపాటు బంధువులతో ఎప్పటికప్పుడు ఫోన్‌లో మాట్లాడుతూ ధైర్యంగా ఉండమని చెబుతూనే ఇక్కడి మిత్రులతో ధైర్యంగా ఉంటున్నాం. ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాం. ఇక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో మరింత ఇబ్బంది ఎదురవుతోంది. ఇలా యుద్ధం జరిగే పరిస్థితి ఉంటుందని ఊహించలేదు. తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలా మంది స్వగ్రామాలకు వెళ్లాలనే ఆందోళనతో ఉన్నారు."
- బాస సిద్ధార్థ, నాగులపేట, కోరుట్ల