కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మంకమ్మ తోటలో నివసించే కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ శ్రీనివాస్.. కొవిడ్ సోకిన వారికి అన్నదానం చేస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు. మే నుంచి కరోనా రోగులకు భోజనం అందిస్తున్నారు. కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ, ఆమె భర్త శ్రీనివాస్ కుటుంబసభ్యులు అంతా కలిసి భోజనం తయారు చేస్తారు. ఆహార పొట్లాలను ద్విచక్రవాహనంపై పెట్టుకొని కొవిడ్ సోకిన వారి ఇళ్లకు వెళ్లి అందిస్తున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగుల కుటుంబసభ్యులు, ఆస్పత్రి బయట ఆకలితో ఉన్నవారికీ భోజనం అందిస్తున్నారు. బస్టాండ్లో ప్రయాణికులకు సాయంత్రం టిఫిన్ పంపిణీ చేస్తున్నారు. రోజూ 100 నుంచి 150 మంది ఆకలి తీరుస్తున్నారు. కరోనా విపత్తు వేళ తమవంతుగా సేవ చేయడం సంతోషంగా ఉందని అంటున్నారు. లాక్‌డౌన్ ముగిసే వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని.. బాధితులు తమను సంప్రదించవచ్చని గుగ్గిళ్ల జయశ్రీ శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: తెరాస, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా