Limca book of record feet: లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో ఎక్కేందుకు వినూత్నంగా ప్రయత్నించాడు కరీంనగర్ జిల్లాకు చెందిన కామారపు రవీందర్. చల్లని నీటిలో అరగంటపాటు ఉండి ఔరా అనిపించాడు. జిల్లా కేంద్రంలోని తీగలగుట్టపల్లిలో ఉన్న ఆయన నివాసంలో సాహసం చేశాడు.
In ice water: కామారపు రవీందర్ బుధవారం నీటి డ్రమ్ములో ఐస్ నింపారు. ఉష్ణోగ్రత 9.2 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోగానే అందులో అరగంట పాటు కూర్చున్నారు. ఈ దృశ్యాన్ని చిత్రీకరించి ఆస్ట్రేలియాలోని వండర్ వరల్డ్ రికార్డు సంస్థకు పంపిస్తానని రవీందర్ తెలిపారు.
గతంలో ఆయన భార్య పేరిట రికార్డు
గతంలో ఆయన భార్య కూడా రికార్డు సాధించింది. రవీందర్ భార్య లక్ష్మి 2018 సంవత్సరంలో తొమ్మిది నెలల నిండు గర్భిణిగా ఉన్నప్పుడు సాహసం చేసింది. కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియంలో 5 కిలోమీటర్ల దూరాన్ని 30 నిమిషాల 22 సెకన్లలో పూర్తిచేసి ప్రపంచ రికార్డు సాధించింది. సాధారణ ప్రసవం ద్వారా ఆరోగ్యకరమైన పాపకు జన్మనిచ్చింది. గర్భిణీలకు వ్యాయామ అవసరాన్ని దేశ ప్రజలకు చాటిచెప్పింది.
మండుటెండలో పది కిలోమీటర్లు
కామారపు రవీందర్ గతంలో రోహిణి కార్తెలో ఒంటిగంటకు మండుటెండల్లో 10 కిలోమీటర్ల పరుగును విజయవంతంగా పూర్తి చేసి ప్రపంచ రికార్డును సాధించారు. 56 ఏళ్ల వయసులో ఎలాంటి వ్యాధులు లేకుండా ఆరోగ్యంగా ఉండి రికార్డులు సాధిస్తున్నారు. ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు పది డిగ్రీల చల్లటి నీటిలో ఉండి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు సాధించేందుకు పూనుకున్నట్లు రవీందర్ తెలిపారు.
నేను గతంలో 42 ఏళ్ల వయసులో రన్నింగ్ చేశాను. గర్భిణీగా ఉన్నప్పుడు మా ఆయన నన్ను ప్రోత్సహించారు. అప్పుడు నేను నార్మల్ డెలివరీ అయ్యాను. అరగంటలో ఐదు కిలోమీటర్లు పరుగెత్తాను. - లక్ష్మీ, రవీందర్ భార్య
అరగంటకు పైగా నేను చల్లని నీటిలో ఉన్నాను. నా వయసు 56 సంవత్సరాలు. పది డిగ్రీల సెల్సియస్ లోపల నీటిలో ఉన్నాను. మన సైన్స్ ఇదవరకే అభివృద్ధి సాధించింది. కానీ చాలా వరకు ప్రజలకు అవగాహన లేదు. ఆరోగ్యానికి వ్యాయామం చాలా అవసరం అనే విషయాన్ని చెప్పేందుకే ఈ సాహసం చేశా. - కామారపు రవీందర్