హుజూరాబాద్ ఉపఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ కుప్ప కూలింది. కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక జరిగిన మొదటి ఉపఎన్నికలో ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఫలితంగా కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంది. ఉపఎన్నికను సీరియస్‌గా తీసుకోకపోవడమే.. ఇంత దారుణమైన ఫలితానికి కారణమని ఆరోపిస్తున్న సీనియర్లు... తక్షణమే సమీక్ష చేయాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని ప్రకటించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి... కార్యకర్తలెవరూ నిరాశకు లోనుకావద్దని సూచించారు. అంతర్గతంగా చర్చించుకుని ముందుకు వెళ్తామని ప్రకటించారు.
డిపాజిట్ దక్కకపోవడంపై..
రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన తరువాత కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వచ్చింది. క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యకర్తల్లో కదలికవచ్చింది. పార్టీపై ఆశలు పెట్టుకున్న శ్రేణులు పార్టీ బలోపేతానికి పని చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై పీసీసీ నాయకత్వంలో నిర్వహిస్తున్న సభలు, సమావేశాలు, సమీక్షలు పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఈ నేపథ్యంలో జరిగిన హజూరాబాద్ ఉపఎన్నికల్లో పుంజుకుంటామన్న వారి ఆశలు అడియాసలయ్యాయి. కనీసం డిపాజిట్ కూడా దక్కకపోవడం.. కాంగ్రెస్ కార్యకర్తలను నిరాశకు గురిచేసింది.
'పీసీసీ పట్టించుకోలే..'
హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో పీసీసీ తీరుపై పార్టీ సీనియర్ నాయకులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉపఎన్నికలను సీరియస్‌గా తీసుకోలేదని, ఐదు నెలలు సమయం ఉన్నా హుజూరాబాద్‌లో పార్టీని బలోపేతం చేసే ప్రక్రియను చేపట్టలేదని విమర్శలు చేశారు. మరికొందరు సీనియర్లు ప్రత్యేక పరిస్థితుల్లో హుజూరాబాద్ ఉపఎన్నికలు జరిగినా.. ఇంత దారుణంగా ఓడిపోతామని అనుకోలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఏకంగా హుజూరాబాద్ ఉపఎన్నిక విషయంలో వాస్తవ పరిస్థితులను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లతానని చెప్పారు. పీసీసీ పట్టించుకోకపోవడం వల్లనే ఘోరమైన ఓటమిని మూటకట్టుకోవాల్సి వచ్చిందని ఆరోపించారు.
ఫలితాలు ఊహించినవే..
హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు ముందు నుంచి ఊహించినవేనని పేర్కొన్న పొన్నం.. దీనిపై పూర్తిస్థాయిలో చర్చించుకోవాల్సిన అవసరం ఉందని.. నియోజకవర్గ స్థాయిలో నేతల్లో ఉన్న విభేదాలను పరిష్కరించుకుని ముందుకు వెళ్లాలని అభిప్రాయపడ్డారు.
ఇదే ఫైనల్ కాదు: రేవంత్
హుజూరాబాద్ ఫలితాలు, పార్టీ నేతల వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ రేవంత్ స్పందించారు. పార్టీ ఓటమికి తనదే బాధ్యతని ప్రకటించిన పీసీసీ అధ్యక్షుడు.. ఈ ఫలితాలు పార్టీ భవిష్యత్‌ను నిర్ణయించలేవన్నారు. కార్యకర్తలు నిరాశకు లోనుకావొద్దని సూచించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులకు పార్టీలో స్వచ్ఛ ఎక్కువగా ఉంటుందని చెప్పిన రేవంత్.. పార్టీ అంతర్గత భేటీలో చర్చించుకొని అందరినీ కలుపుకొనే ముందుకువెళ్తానని ప్రకటించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓటమిపాలైన బల్మూరి వెంకట్ భవిష్యత్తులో పెద్ద నాయకుడు అవుతారని జోస్యం చెప్పారు.
గత ఎన్నికల్లో దాదాపు 62 వేల ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో కేవలం 3,012 ఓట్లు మాత్రమే రావడం కాంగ్రెస్ శ్రేణులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇంత దారుణమైన పరిస్థితులు ఉత్పన్నమవుతాయని ఊహించలేదని కాంగ్రెస్ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఉదయం 10:30 గంటలకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని పీసీసీ నిర్ణయించింది.
ఇదీచూడండి: congress defeated: కాంగ్రెస్ కకావికలం.. రేవంత్ క్రేజ్ ఏమైంది... ఓటర్లెందుకు చేయిచ్చారు?