సైబర్ నేరగాళ్లు జడలు విప్పుతున్నారు .ఇప్పటి వరకు ప్రధాన పట్టణాలకే పరిమితమైన మోసాలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో సైబర్ నేరగాళ్లు ఓ హోటల్ యజమానిని బోల్తా కొట్టించి డబ్బు స్వాహా చేశారు. హోటల్ యజమాని మొగిలికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి 50 ప్లేట్ల పూరీ పార్శిల్ కావాలని కోరాడు. ఏటీఎం కార్డు నెంబర్ చెబితే డబ్బులు పంపిస్తానని.. కార్డును ఫోటో తీసి వాట్సప్ ద్వారా పంపమన్నాడు.
నిజమే అనుకొని నమ్మిన హోటల్ యజమాని తనకు పరిచయం ఉన్న వ్యక్తి సంతోశ్ ఏటీఎం కార్డును ఫోటో తీసి పంపించాడు. సాంకేతికత ఆధారంగా గుర్తు తెలియని వ్యక్తి... ఖాతా నుంచి రూ. 25,134 డ్రా చేసుకున్నాడు. డబ్బులు డ్రా అయినట్లు చరవాణికి సమాచారం రావటం వల్ల అప్రమత్తమైన సంతోశ్.. బ్యాంక్ అధికారులను సంప్రదించాడు. తన ఖాతాను నిలుపుదల చేయించుకున్నాడు. ఘటనపై బాధితుడు సంతోశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సృజన్‌రెడ్డి పేర్కొన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి వ్యక్తిగత సమాచారం అడిగినప్పుడు చెప్పకుండా... జాగ్రత్త పడాలని సూచించారు.