ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన నాలుగైదు జిల్లాలకు కేంద్ర బిందువుగా ఉన్న కరీంనగర్‌కు వైద్యం కోసం వివిధ ప్రాంతాల నుంచి రోగులు వస్తుంటారు. ఈ సారి కరోనా సెకండ్ వేవ్‌లో ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లోను వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. జిల్లా ఆసుపత్రితో పాటు రెండు వైద్య కళాశాలసు, 63 ఆసుపత్రుల్లో కొవిడ్ వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే పరిస్థితి తీవ్రంగా ఉంటేనే కరోనా బాధితులు ఆసుపత్రుల్లో చేరగా.. మిగతా సందర్భాల్లో మాత్రం కేవలం మందుల దుకాణాల్లోనే ఔషధాలు కొనుగోలు చేసి బాధితులు వైద్యం పొందారు.
నల్లదందాకు అడ్డుకట్ట
నగరంలో దాదాపు 600కు పైగా ఔషధ దుకాణాలు ఉండగా కొనుగోళ్లు కూడా అదే స్థాయిలో జరిగాయి. ఎప్పుడూ ఊహించని రీతిలో మాస్కులు, వేపోరైజర్లు, ఆక్సీపల్స్‌మీటర్లతో పాటు ఔషధాలు విపరీతంగా అమ్ముడు పోయాయి. అనూహ్యరీతిలో ఔషధాల కొరత కూడా ఏర్పడిందని డ్రగ్గిస్టులు తెలిపారు. అయితే లైఫ్ సేవింగ్ డ్రగ్‌గా భావించిన రెమ్‌డెసివిర్ విషయంలో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. వాటిని బ్లాక్ మార్కెట్‌కు తరలించకుండా తనిఖీలు నిర్వహించారు.
తగ్గిన వినియోగం
కరోనా రెండో దశ ఉద్ధృతి తర్వాత దాదాపు నెలరోజుల తర్వాత పరిస్ధితి పూర్తిగా మారిపోయింది. జూన్ మొదటి వారంలో కరోనా కేసులు తగ్గుతాయని అంచనా వేసినట్లుగానే క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఒకవైపు ఆసుపత్రుల్లో పడకలు ఖాళీకాగా.. ఔషధాలకు వినియోగం కూడా గణనీయంగా తగ్గిపోయింది. గత వారం రోజులుగా ఔషధాలు కొనుగోలు చేసేవారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. మాస్కులు, శానిటైజర్లు, వేపోరైజర్లు, ఆక్సీపల్స్ మీటర్లకు పూర్తిగా డిమాండ్ తగ్గిపోయిందని ఔషధ దుకాణదారులు తెలిపారు.
ప్రస్తుతం మందుల వినియోగం తగ్గినా జాగ్రత్తలు మాత్రం కొనసాగిస్తున్నారని ఔషధ వ్యాపారులు అంటున్నారు. కరోనా సంక్రమణ తగ్గినప్పటికీ జాగ్రత్తలు మాత్రం పాటించేలా తమ వంతు అవగాహన కల్పిస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: niranjan reddy: 'అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి కేంద్రం ఏం చేసింది.?'