ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. జిల్లా వ్యాప్తంగా కేసుల సంఖ్య మూడుకు తగ్గిపోయాయి. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో గత 21రోజులుగా కొత్త కేసులు నమోదు కాకపోవడం వల్ల రెండు జిల్లాలను గ్రీన్‌జోన్‌లోకి మార్చాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపించారు. మరో వైపు పెద్దపల్లి జిల్లా గ్రీన్‌జోన్‌గా కొనసాగుతోంది.
ప్రస్తుతం కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జగిత్యాలలో ఒక్కొక్కటి చొప్పున కరోనా బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కళ్లపల్లిని కంటెన్మెంట్ ప్రాంతంగా ప్రకటించడమే కాకుండా ఆ గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్న మానాల, లంబాడిపల్లి గ్రామాల్లో వైద్యబృందాలు ఇంటింటా తిరుగుతూ వైద్య పరీక్షలు చేపడుతున్నారు.
ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు ఎవరైతే స్వస్థలాలకు వెళ్లాలనుకునుకుంటున్నారో వారి నుంచి పోలీసులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అన్ని ప్రాంతాల్లోనూ సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూని కట్టుదిట్టంగా కొనసాగిస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలు సడలించినా ప్రజలు మాత్రం మధ్యాహ్నం తర్వాత ఇళ్ల నుంచి బయటికి రావడానికి ఇష్టపడడం లేదు. ఎవరైనా ప్రజలు ఎలాంటి కారణం లేకుండా అనవసరంగా రోడ్లపై తిరుగూతూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.
ఇవీ చూడండి: దేశీయ కిట్లు వచ్చేస్తున్నాయ్....!