నియంత్రిత వ్యవసాయ విధానం కాస్తా నియంతృత్వ విధానంగా మారుతోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కరీంనగర్‌లో దుయ్యబట్టారు. రైతులను రైస్ మిల్లర్ల నుంచి విముక్తి కల్పించేందుకు దొడ్డు రకం ధాన్యానికి కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తే తెరాస మళ్లీ సన్న రకాల ద్వారా రైతులను మిల్లర్లకు తాకట్టు పెట్టేందుకు యత్నిస్తోందని పేర్కొన్నారు. పత్తి విషయంలో జిన్నింగ్ మిల్లులకు, సన్న రకం ధాన్యంతో మిల్లర్లకు లాభం చేకూర్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
రాష్ట్రంలో పండ్ల తోటలకు ప్రోత్సాహం పూర్తిగా కరువయ్యిందని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు ఏళ్లుగా దాదాపు 400 మంది ఉద్యానవన విస్తరణ అధికారులను ప్రభుత్వం తొలగించిందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు బంధు అంటే విత్తనం పెట్టక ముందు ఇవ్వాలి కానీ.. కొత్తగా రైతు పెట్టిన విత్తనాన్ని అధికారి ధృవీకరిస్తేనే ఇస్తామంటున్నారని తెలిపారు. ఈ పథకం రైతుకు ఎలా ఉపయోగపడుతుందో ప్రభుత్వమే చెప్పాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు.