Road Accidents in Telangana Today : రాష్ట్రంలో రహదారులు రక్తమోడాయి. వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట బ్రిడ్జి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాంగ్ రూట్లో వచ్చిన ఇసుక ట్రాక్టర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్ర గాయాల పాలైన మరో ఇద్దరు యువకులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. యువకులు ముగ్గురు చిగురుమామిడి మండలం రామంచకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదం సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
Road Accident in Karimnagar : రేణిగుంట బ్రిడ్జి వద్ద మోయ తుమ్మల వాగులో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతోంది. ఇప్పుడు జరిగిన ప్రమాదం స్థలంలో గతంలో నాలుగు సార్లు ప్రమాదాలు జరిగాయి. అయినప్పటికీ పోలీసులు జాప్యం చేస్తున్నారు. రోజువారీగా సుమారు 80 ట్రాక్టర్లు అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రాణాలు కోల్పోతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. మృతులు గుడ్డిపల్లి అరవింద్(28), శివరాత్రి సంపత్(27), శివరాత్రి అంజి(26).. వీరు ముగ్గురు ఒకే గ్రామానికి చెందిన వారు.
Accidents Today in Telangana : రంగారెడ్డిలోని బండ్లగూడ జాగీర్ సన్ సిటీ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. మార్నింగ్ వాక్‌కు వెళ్తున్న ముగ్గురిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యవాతపడ్డారు. మృతులు తల్లి అనురాధ, కుమార్తె మమతగా గుర్తించారు. వాకింగ్ చేస్తున్న మరో మహిళ కవిత సహా కారులో ఉన్న మరొకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.
Road Accident in Hyderabad : హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. సోమవారం అర్ధరాత్రి కావేరి ట్రావెల్స్‌కు చెందిన ఎన్ఎల్ 07 బీ 0767 నంబర్ గల బస్సు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్ద అదుపుతప్పి.. యూటర్న్ తీసుకుంటున్న ఒక ద్విచక్ర వాహనాన్ని, ఓ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. బ్రేక్ ఫెయిల్ అవ్వటంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి కారణమైన బస్సును రహదారిపై నుంచి పక్కకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న కూకట్‌పల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరోవైపు జాతీయ రహదారిపై ఓ లారీ ప్రమాదానికి గురి కావడంతో మరో మూడు వాహనాలు దానిని ఢీకొన్నాయి. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నాలుగు గంటల పాటు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ ఘటన జడ్చర్ల మండలం పరిధిలోని మాచారం జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఉదయం 5.30 గంటల ప్రాంతంలో రహదారిపై ఉన్న డివైడర్‌ను ఢీకొని లారీ బోల్తా పడింది. దీంతో ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులను ఒకే దారిలో పంపించడంతో ఇదే సమయంలో గొల్లపల్లి వద్ద కర్నూలు వైపు నుంచి వెళ్తున్న పాల ట్యాంకర్‌కు జడ్చర్ల వైపుకు వెళ్తున్న టిప్పర్ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి. 108లో ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరగడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు జడ్చర్ల పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: