Karimnagar Book Fair: డిజిటల్ వినియోగం పెరిగిన కారణంగా పుస్తకాలు చదివేవారి సంఖ్య తగ్గింది. ఫలితంగా క్రయవిక్రయాలు పడిపోయాయి. ఈ క్రమంలో యువతి యువకులను పుస్తక పఠనం వైపు మళ్లించాలనే ఉద్దేశంతో కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన బుక్ ఫెయిర్ సత్ఫలితాలిస్తోంది. ఇందులో అన్నిరకాల పుస్తకాలు ప్రదర్శించారు. విశాలాంధ్ర, నవోదయ, హైదరాబాద్ బుక్ ట్రస్ట్, ఎమెస్కోతో పాటు... ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, ఓరియంట్ బ్లాక్‌స్వాన్, కేంబ్రిడ్జ్, పియర్సన్, టాటా మెగ్రాహిల్ పబ్లికేషన్స్‌కు సంబంధించిన ప్రామాణిక పుస్తకాలు అందుబాటులో ఉంచారు. ఇలాంటి ప్రదర్శనల ద్వారా ఎంతో ఉపయోగం ఉందని ఉపాధ్యాయులు, రచయితలు పేర్కొంటున్నారు.
పుస్తక ప్రియుల ఆసక్తి...
ఆంగ్ల గ్రంథాలు, బిజినెస్, మేనేజ్‌మెంట్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, కాంపిటీటివ్ పుస్తకాలే కాదు.. తెలుగు సాహితీ గ్రంథాలకు పుస్తక ప్రదర్శనలో ఆదరణ లభిస్తోంది. శ్రీశ్రీ, తస్లీమా నస్రీన్, తాపీ ధర్మారావు, తిలక్, ముళ్లపూడి వంటి ప్రముఖ రచయితల పుస్తకాలను కొనుగోలుకు పుస్తక ప్రియులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈనెల 8 వరకు జరుగనున్న ఈ ప్రదర్శనలో దాదాపు 20 వేల పుస్తకాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఉదయం 10 నుంచి రాత్రి 8గంటల వరకు నిర్వహిస్తున్నారు.
యువతను పుస్తక ప్రదర్శనకు రప్పించేందుకు కలెక్టర్ ఆర్వీ కర్ణన్... డ్రా పద్ధతిలో అమెజాన్ కిండిల్ ఈ-రీడర్ అందించే ఏర్పాట్లు చేయడంతో సందర్శకుల సంఖ్య పెరుగుతోంది.
ఇదీ చూడండి: