JP NADDA ON CM KCR తెలంగాణలో త్వరలో కమలం వికసిస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆకాంక్షించారు. బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభలో పాల్గొన్న జేపీ నడ్డా... బండి పాదయాత్ర గ్రామగ్రామానికి వెళ్తోందని పేర్కొన్నారు. అవినీతి టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపుదామని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌పై పోరాటానికి తెలంగాణ ప్రజలు కలసిరావాలని అన్నారు. కేసీఆర్.. బీఆర్‌ఎస్‌తో రావడం కాదు.. వీఆర్‌ఎస్ తీసుకునే సమయం దగ్గరికి వచ్చిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించారు.
''దోపిడీ కోసమే ధరణీ పోర్టల్ తెచ్చారు. యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి, కొండగట్టు ఆంజనేయస్వామికి ప్రార్థిస్తున్నాను. సుదీర్ఘంగా కాలంగా ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్న బండి సంజయ్‌కు అభినందనలు. ఈ యాత్ర ద్వారా ఇంటింటికి వెళ్లి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారు. కేసీఆర్‌కు గుడ్ బై చెప్పాల్సిన సమయం ఆసన్నమయ్యింది. కేసీఆర్ ప్రభుత్వం అవినీతిమయం, ప్రజాస్వామ్యంపై కేసీఆర్‌కు నమ్మకం లేదు.'' - జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు
తెలంగాణలో కేసీఆర్ పాలనకు విశ్రాంతి... బీజేపీకి అధికారంలోకి వచ్చే సమయం వచ్చిందని ఆకాంక్షించారు. మోదీ ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేసిందని వెల్లడించారు. ఎస్సీ, ఆదివాసీ మహిళ రాష్ట్రపతి పదవిని అధిష్ఠించారని తెలిపారు. కేసీఆర్... ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శించారు.
ఇవీ చూడండి