హరీశ్‌రావు చేప్పేవన్ని అబద్ధాలేనని భాజపా నేత ఈటల రాజేందర్(Etela Rajender) కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో దుయ్యబట్టారు. హుజూరాబాద్‌లో అభివృద్ధి జరగలేదని హరీశ్‌రావు తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. తనపై చేస్తున్న ఆరోపణలపై హుజూరాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో చర్చకు సిద్ధమా? అంటూ హరీశ్‌రావుకు ఈటల సవాల్ విసిరారు. తమ మద్దతుదారులను హరీశ్‌రావు ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్ల బిల్లులు ఆపి భయపెడుతున్నారన్నారు. తాను నియమించిన ఒప్పంద ఉద్యోగులను తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీ చరిత్ర ప్రజలకు చెప్పాల్సి వస్తుంది...
ఈటలతో పనిచేసే కార్యకర్తలెవరు? ఎవరు సపోర్టు చేస్తున్నారనే వివరాలు తెలుసుకుని మరీ వారి ఇళ్లకు వెళ్లి ప్రలోభపెడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంట్రాక్టర్ల బిల్లులు ఆపి, తమ వెంట ఉంటేనే రిలీజ్ చేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. డ్రామా కంపెనీలో నటునిలాగా మహిళల దగ్గరకు వెళ్లి ఏదో ఒకటి మాట్లాడి సోషల్ మీడియాలో పెట్టి జనాలకు ఆగం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటివి ఆపకపోతే నీ చరిత్ర ప్రజలకు తప్పక చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు కనీసం కూర్చుని మాట్లాడుకునే సంప్రదాయం లేకుండా చేసింది మీరు కాదా..? అని నిలదీశారు. కిరణ్ కుమార్ రెడ్డి రూపాయి ఇవ్వనని అన్ననాడు ఇద్దరం కలిసే కదా నిలదీసింది అని ఈటల గుర్తు చేశారు.
త్వరలోనే అన్ని బయటకు వస్తాయి..
"నేను కుంకుమ భరణిలు పంచానా ? చూపిస్తే ముక్కు నేలకు రాస్తా.. లేదంటే మీరు రాయాలి. డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టలేదని ప్రజలకు గుచ్చిగుచ్చి చెబుతున్నారు. నా వెంట రా.. ఎక్కడెక్కడ కట్టినమో చూపిస్తా. హుజురాబాద్, జమ్మికుంట, కమలాపూర్‌లో 500 ఇండ్ల చొప్పున కట్టించా. ఇప్పటికే 2 వేల ఇండ్లు పూర్తయ్యాయి. కేవలం సీఎం కేసీఆర్ ఆదేశిస్తేనే నిధులు మంజూరు చేసే రబ్బరు స్టాంపు హరీశ్‌రావు. నీకు స్వేచ్ఛ ఉందా? సొంతంగా ఎవరికైనా ఒక్క బిల్లు మంజూరు చేయగలవా? నీకు బిల్లులు మంజూరు చేసే సత్తా ఉందా? ఎన్నికోట్ల అప్పులు కడుతున్నావో, ఎంత ఆదాయం వస్తుందో చెప్పగలవా? ఏడాదికి 10 వేల కోట్లు దళితజాతికి సొంతంగా ఖర్చుచేయగల సత్తా ఈ ప్రభుత్వానికి ఉందా? హైదరాబాద్ భూముల విషయంలో, కన్వర్షన్ విషయంలో ఏం చేస్తున్నారో మొత్తం డాటా మా దగ్గర ఉంది. మొత్తం చిట్టా సందర్భం వచ్చినప్పుడు బయటకు వస్తుంది." - ఈటల రాజేందర్, భాజపా నేత
ఇదీ చూడండి:
Revanth reddy : కృష్ణా జలాల తరలింపు... తెలంగాణ ప్రజలకు మరణశాసనమే..