CLP Bhatti Vikramarka Padayatra in Karimnagar: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేస్తున్న 'పీపుల్స్ మార్చ్' పాదయాత్ర ఇవాళ కరీంనగర్ జిల్లాకు చేరింది. ఇవాళ ఉదయం హుజూరాబాద్ నియోజకవర్గంలోని తనుగుల క్రాస్‌రోడ్డు, గండ్రపల్లి, నాగంపేట గ్రామాల మీదుగా సాగిన పాదయాత్రలో గ్రామీణులను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వారి సమస్యలను పరిష్కరిస్తామని భట్టి హామీ ఇచ్చారు.
CLP Bhatti Vikramarka comments on BRS : అనంతరం నాగంపేట వద్ద మధ్యాహ్న భోజన సమయంలో విశ్రాంతి తీసుకొన్నారు. ఆ సమయంలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు విషయాల్లో అభివృద్ధి సాధించిందని తెలిపారు. మద్యం అమ్మకాల్లో, రాష్ట్రాన్ని అప్పులమయంగా చేసే విషయంలో అభివృద్ధి సాధించిందని ఎద్దేవా చేశారు. నిధులు, నీళ్లు, నియామకాలు ఏమి లేకుండా తెలంగాణలో చేశారని మండిపడ్డారు.
తొమ్మిదేళ్లలో ఒక్క ఏడాది కూాడా అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పంట పరిహారం ఇవ్వలేదని భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. ఇదేనా మోడల్ తెలంగాణ అని ప్రశ్నించారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని అన్నారు. కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో సాధించిన అభివృద్ధి ఏంటని నిలదీశారు. ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తే అరెస్టుల పేరుతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. మానేరు వాగులో ఇసుక మాఫియా జోరుగా సాగుతోందని, ప్రభుత్వం అండదండలతోనే ఈ దందా జరుగుతోందని ఆరోపించారు.
Bhatti Vikramarka fires on KCR: రానున్న రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని భట్టి విశ్వాసం జోస్యం చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోని రాగానే.. రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. పేదలు ఇళ్లు కట్టుకోవడానికి రూ. 5లక్షలు ఇస్తామని.. భూమి లేని నిరుపేదలకు స్థలం ఇస్తామని ప్రకటించారు. పాదయాత్రలో భట్టి వెంట ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు తోడుగా వచ్చి బ్రహ్మరథం పట్టారు. యాత్రలో జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేతలు పొన్నం ప్రభాకర్, కవ్వంపల్లి సత్యనారాయణ, బల్మూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
"కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో సాధించిన అభివృద్ధి ఏంటి.. మద్యం అమ్మకాల్లో, రాష్ట్రాన్ని అప్పులమయంగా చేసే విషయంలో అభివృద్ధి సాధించింది. ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. నిధులు, నీళ్లు, నియామకాలు లేకుండా చేశారు. ఇదేనా తెలంగాణ మోడల్.. మానేరు వాగులో ఇసుక మాఫియా జోరుగా సాగుతోంది. ప్రభుత్వ అండదండలతోనే ఈ దందా సాగుతోంది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి." - భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
ఇవీ చదవండి:
'కేసీఆర్ చెప్పేవన్నీ కోతలేనని మరోసారి తేలిపోయింది'
'అధికారంలో ఉన్న కేసీఆర్ కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తున్నారు'