రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంతో అనేక మంది ఉపాధిని పొందుతున్నారు. దీంతో పలువురికి ఉపాధితో పాటు ఇతరులకు స్ఫూర్తి కూడా లభిస్తోంది. దళిత బంధు పథకంలో లబ్ధిపొందలేక పోయిన వారు.. పరిశ్రమల శాఖ నిర్వహించే అవగాహన సదస్సులకు హాజరై చిన్నచిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో 18ఏళ్లకుపైబడి కేవలం ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై ఉంటే చాలు.. వారు ప్రధానమంత్రి ఉపాధి కల్పనా పథకం కింద రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు రుణం తీసుకొనే సదుపాయం కల్పిస్తామని విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అంతేకాకుండా జనరల్ కేటగిరి వారికి.. గ్రామీణ ప్రాంతాల్లో 25శాతం, పట్టణ ప్రాంతాల్లో 15శాతం రాయితీని బ్యాంకులు ఇస్తాయని చెబుతున్నారు. అయితే లబ్ధిదారుల వాటా 10శాతం ఉండాలని సూచిస్తున్నారు.
వివిధ అవకాశాల పట్ల అవగాహన: పది లక్షల రూపాయల వరకు ఎలాంటి పూచికత్తు లేకుండా రుణం ఉంటుందని చెబుతున్నా.. ఆచరణలో మాత్రం అలా జరగడం లేదని యువకులు వాపోతున్నారు. ప్రధానంగా వ్యవసాయ క్షేత్రాల వద్దనే ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకొనేందుకు ఉన్న అవకాశాల పట్ల అవగాహన కల్పిస్తున్నారు. దీంతో రైతులు పండించిన పంటలకు.. అదనపు విలువ కలిసి రావడమే కాకుండా మరికొందరికి.. ఉపాధి పొందే అవకాశం ఉందని చెబుతున్నారు. కేవలం వ్యవసాయం ద్వారా మాత్రమే కాకుండా.. చేపల పెంపకంతో కూడా ఉపాధిని పొందవచ్చని సూచిస్తున్నారు.
ప్రధానమంత్రి ఉపాధి కల్పనా పథకం కింద అనేక మంది రుణాలు పొంది పారిశ్రామికులుగా మారే అవకాశం ఉందని.. కరీంనగర్ జిల్లా పరిశ్రమల మేనేజర్ నవీన్ తెలిపారు. దరఖాస్తు చేసుకున్నవారందరికి కాకుండా.. లబ్ధిదారుడు పెట్టిన యూనిట్ విజయవంతం అవుతుందని భావిస్తే మాత్రమే బ్యాంకులు రుణాలు ఇస్తున్నారని నవీన్ అంగీకరించారు. నిరుద్యోగులకు మాత్రమే పథకాల గురించి అవగాహన కల్పించి అధికారులు చేతులు దులుపుకోకుండా.. బ్యాంకర్లకు కూడా తగిన అవగాహన కల్పిస్తే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని యువకులు సూచిస్తున్నారు.
"ప్రభుత్వం బ్యాంకుల నుంచి ఎటువంటి సెక్యూరిటీ లేకుండా మాకు రూ.5 లక్షల నుంచి రూ.10లక్షలు ఇస్తే లోన్ ఇస్తే మాకు ఉపయోగంగా ఉంటుంది. సంవత్సరం వరకు నా వ్యాపారాన్ని విజయవంతంగా నడిపాను. కానీ కొవిడ్ వల్ల ఇబ్బందులు వచ్చాయి. అందువల్ల లోన్ ఇన్స్టాల్మెంట్ కట్టడం ఆలస్యం అయింది." - బి.కుమార్, లబ్ధిదారుడు
"బ్యాంకు వారు అభ్యర్థి పరిజ్ఞానం, నాలెడ్జ్‌ను చూసి లోన్లు ఇస్తున్నారు. అక్కడ యూనిట్ విజయవంతం అవుతుందా లేదా అనే అంశంతోనే లోన్లు ఇస్తున్నారు. చాలా వరకూ కూడా యువతీ, యువకులు తగు పరిజ్ఞానంతో దరఖాస్తు చేసుకోవాలి. ఈ సంవత్సరంలో 300 యూనిట్లకు దరఖాస్తులు వచ్చాయి." - నవీన్, పరిశ్రమల మేనేజర్
ఇవీ చదవండి: Talasani Latest Comments on BJP : 'తాటాకు చప్పుళ్లకు టీఆర్ఎస్ భయపడదు'
విచిత్రంగా జడేజా 'ఫ్యామిలీ పాలిటిక్స్'.. భాజపా అభ్యర్థిగా భార్య.. కాంగ్రెస్ ప్రచారకర్తగా చెల్లి