ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై(Rains in nizamabad) గులాబ్ తుపాన్(gulab cyclone effect ) తీవ్ర ప్రభావం చూపింది. రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లపై వరద ఉప్పొంగడంతో చాలా చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కామారెడ్డి జిల్లాలో గోడ కూలి ఒకరు మృతి చెందారు. ప్రాజెక్టులు జలకళ సంతరించుకోగా.. చెరువులు అలుగు పారుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో వరద తాకిడికి ఫౌల్ట్రీ ఫామ్‌లోని కోళ్లు కొట్టుకుపోగా.. స్థానికులు వాటి కోసం ఎగబడ్డారు. భారీ వర్షాల నేపథ్యంలో రెండు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. పలు చోట్ల పంట పొలాలు వరద నీటితో చెరువులను తలపించాయి.
నగరంలో ఇళ్లలోకి వరద నీరు
నిజామాబాద్‌లో లోతట్టు కాలనీల్లోని ఇళ్లన్నీ నీళ్లలో మునిగిపోయాయి. చాలా చోట్ల వస్తువులు కొట్టుకుపోగా.. సామాగ్రి పూర్తిగా తడిసిపోయింది. ఉదయం నుంచి నగరంలో కురిసిన వర్షంతో పాటు ఎగువ నుంచి అలుగు నీళ్లు వాగుల్లో చేరడంతో లోతట్టు కాలనీలు జలదిగ్బంధమయ్యాయి. నగరంలోని బస్టాండ్ రోడ్డు, బోధన్ రోడ్డులో నిజామాబాద్-బోధన్ ప్రధాన రహదారి నీట మునిగింది. ఆర్మూర్ రోడ్డులో కంఠేశ్వర్ రైల్వే కమాన్, మనిక్ భండార్, హైదరాబాద్ రోడ్డులోనూ నీళ్లు రోడ్డుపై చేరాయి. ఎడతెరిపిలేని వానలకు లోతట్టు ప్రాంతాలైన చంద్రశేఖర్ కాలనీ, పులాంగ్, కోటగల్లీ, అర్సపల్లి, గౌడ్స్ కాలనీ, కంటేశ్వర్, ఒడ్డెర కాలనీ, ఎల్లమ్మగుట్ట నీటిలో మునగడంతో ఆయా కాలనీవాసులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇళ్లలోకి నీరు రావటంతో రోడ్డుపైకి వచ్చి చంద్రశేఖర్ నగర్ కాలనీ వాసులు ఆందోళన చేశారు. ఈ క్రమంలోనే కాలనీవాసులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఘటన స్థలాన్ని సందర్శించి వారికి సర్ది చెప్పారు. గూపన్ పల్లి వద్ద పులాంగ్ వాగు ఆనుకుని ఉన్న ఇళ్లు, ఒడ్డెర కాలనీలో వాగు సమీపంలో ఉన్న ఇళ్లల్లోకి నీళ్లు పూర్తిగా చేరి బాధితులు ఇబ్బందులు పడ్డారు. కనీసం తల దాచుకునే చోటు లేక అవస్థలు పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని ఆర్మూర్, బోధన్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో భారీగా వర్షపాతం నమోదైంది. కమ్మర్ పల్లి, ఆలూరు, సీహెచ్ కొండూరు గ్రామాల్లో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
పలుచోట్ల నిలిచిన రాకపోకలు
సిరికొండలో కప్పలవాగు ఉద్ధృతికి నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్ని మండలం జలాల్ పూర్ చెరువు పొంగి నీరు రోడ్లపైకి రావడంతో జలాల్ పూర్ - బడా పహాడ్ మధ్య రాకపోకలు స్తంభించాయి. వేల్పూర్ మండలం మోతె వద్ద వంతెనపై కప్పల వాగు ప్రవహించడంతో వేల్పూర్-భీంగల్ మధ్య రవాణా నిలిచిపోయింది. రుద్రూర్ నుంచి బొప్పాపూర్ వెళ్లే మార్గంలో రోడ్డుపై నుంచి గుండ్లవాగు పారడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. జక్రాన్ పల్లి మండలం మనోహరాబాద్ -కలిగోట్ మధ్య వంతెనపై వరద నీటి ప్రవాహంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆర్మూర్ మండలంలోని ఆర్మూర్-గుత్ప మార్గంలో రోడ్డుపై వాగు ప్రవాహంతో రాకపోకలు నిలిచాయి.
నగర శివారులోని గూపన్‌పల్లికి వెళ్లే మార్గంలో వంతెన నీట మునిగి రాకపోకలు నిలిచిపోయాయి. అంకాపూర్-ఆర్మూర్ రోడ్డులోనూ భారీగా నీళ్లు చేరి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. బోధన్‌లోని అనిల్ టాకీస్ రోడ్, కొప్పర్గ - సిద్దాపూర్, ఎడపల్లి మండలంలోని ఠానా కలన్-కుర్నపల్లి , రెంజల్ మండలంలోని నీల గ్రామాల రోడ్లపై వర్షపు నీరు చేరడంతో అధికారులు మూసేశారు. సిరికొండ మండలంలోని జగదాంబ తండా రోడ్డు వాగు ఉధృతికి తెగిపోయి రాకపోకలు నిలిచాయి. జక్రాన్ పల్లి మండలం చింతలూర్ శివారులో చెరువు అలుగు పారడంతో పక్కనే ఉన్న పౌల్ట్రీ ఫామ్‌లోని కోళ్లు వరద ఉధృతిలో కొట్టుకుపోయాయి. కోళ్లను తీసుకువెళ్లేందుకు గ్రామస్థులు ఎగబడ్డారు. నవీపేట మండలం దర్యాపూర్ మైసమ్మ చెరువు అలుగు నీటిలో గ్రామస్తులు చేపలు పట్టారు. కందకుర్తి వద్ద వంతెనను ఆనుకొని గోదావరి ప్రమాదస్థాయిలో ప్రవహిస్తోంది.
కామారెడ్డి జిల్లాలో వర్షం భీభత్సం
జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగి పోర్లుతున్నాయి. కామారెడ్డి నుంచి కరీంనగర్ వెళ్లే ప్రజలు మరో మార్గంలో వెళ్లాలని పోలీసులు సూచించారు. సిరిసిల్ల నుంచి కరీంనగర్ వెళ్లే దారిని భారీ వర్షం కారణంగా మూసేశారు. తాడ్వాయి మండలంలో బ్రాహ్మణపల్లి వాగు పొంగిపొర్లింది. ఆ దారిలో బ్రాహ్మణపల్లి, కాళోజీవాడి, సంగోజివాడి, చందాపూర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులకు వాగు ప్రవాహం అడ్డంకిగా మారింది. అదే మండలంలోని భీమేశ్వర వాగు పొంగిపొర్లుతోంది. అటువైపుగా వెళ్లే ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. పిట్లం మండలంలో రాంపూర్ కలాన్ వద్ద వంతెనపై నుంచి వాగు ప్రవాహంతో రెండు రోజులుగా బాన్సువాడ-పిట్లం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రాజంపేట-చిన్నమల్లారెడ్డి మధ్య మొండివాగు ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. గాంధారి-బాన్సువాడ రహదారిపై సర్వపూర్ వద్ద ముద్దెల్లి పెద్ద వాగు ఉద్ధృతితో రాకపోకలు నిలిచాయి. మద్నూర్ మండలం గోజె గావ్ లెండి వాగుకు భారీగా వరద నీరు చేరి రవాణా స్తంభించింది. మద్నూర్ మండలం డోంగ్లి- మాధన్ హిప్పర్గ మార్గంలో నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద వరద నీరు చేరి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. బిచ్కుంద మండలం ఖత్ గావ్-కుర్లా మార్గంలో వరద నీటి ప్రవాహానికి రోడ్డు కోతకు గురై వాహనదారులు అవస్థలు పడ్డారు.
భారీ వర్షాల ప్రభావంతో మాచారెడ్డి మండలం చుక్కాపూర్ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలోకి వర్షపు నీరు వచ్చింది. ఆలయ ప్రాంగణంతో పాటు స్వామివారి గర్భగుడిలోకి వర్షపు నీరు చేరింది. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి శివారులో మొండివాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కామారెడ్డి-మెదక్ రహదారిలో బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి.
కామారెడ్డిలో భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు రాత్రంతా జాగరణ చేశారు. పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ నీటి ప్రవహంతో జలసంద్రంగా మారాయి. కామారెడ్డి మున్సిపాలిటీలోని సిరిసిల్ల , సాయిబాబా , అడ్లూరు రోడ్లు జలమయమయ్యాయి. పంచముఖి హనుమాన్ ఆలయంలోకి నీరు చేరగా.. ఆ కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఇల్లు కూలి మహిళ.. విద్యుత్ షాక్‌తో రైతు మృతి
జిల్లాలోని బీర్కూరు మండలం బైరాపూర్‌లో ఇళ్లలోకి ప్రవేశించిన వర్షం నీటిని బయటకు ఎత్తిపోశారు. కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలో ఓ ఇల్లు కూలి నర్సవ్వ అనే మహిళ మృత్యువాత పడగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పలు గ్రామాల్లో భారీ వర్షానికి 10 ఇళ్లు నేలమట్టమయ్యాయి. జిల్లాలో అత్యధికంగా మాచారెడ్డిలో 14 సెంటీమీటర్లు, అత్యల్పంగా 4 సెంటీమీటర్లు బిక్కనూరులో వర్షం కురిసింది. సదాశివ నగర్ కామారెడ్డి గాంధారి, బిక్కనూరు, బాన్సువాడ, బిర్కూర్, జుక్కల్, బిచ్కుంద, ఎల్లారెడ్డిలో భారీ వర్షం కురిసింది. మాచారెడ్డి మండలం నెమలి గుట్ట- సోమార్ పేట మధ్య బీటీ రోడ్డు తెగిపోయి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎల్లారెడ్డి మండలం హజీపూర్‌లో భారీ వృక్షం నేలకూలింది. ఫలితంగా ఎల్లారెడ్డి- కామారెడ్డిల మధ్య ట్రాఫిక్ స్తంభించింది. బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ పంచాయతీ పరిధిలోని కన్నయ్య తండాలో పంట పొలంలో విద్యుత్ షాక్ తో రైతు ఆశ్రద్ మృతి చెందాడు.
ఉమ్మడి జిల్లాలోని నదులకు భారీగా వరద
నిజామాబాద్ జిల్లాలో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. కందకుర్తి, సాలూర వద్ద వంతెనలను ఆనుకుని గోదావరి నది ప్రవహిస్తోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద పోటెత్తింది. మహారాష్ట్ర నుంచి వచ్చే వరదతో పాటు స్థానికంగా కురిసిన వర్షాలకు మూడు లక్షల క్యూసెక్కుల నీళ్లు చేరుతుండగా.. అంతే మొత్తంలో 33 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టంతో జలకళను సంతరించుకుంది. ఎగువన మంజీరా నదిపై ఉన్న సింగూరు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేయడంతో ప్రాజెక్టులోకి ప్రవాహం చేరుతోంది. దీంతో నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు మంజీరాలోకి నీటిని విడుదల చేశారు. అలాగే పోచారం, సింగీతం, కల్యాణి, కౌలాస్ నాలా ప్రాజెక్టులు సైతం నీటితో నిండిపోయాయి.
దెబ్బతిన్న పంటలు
భారీ వర్షాలకు ఉమ్మడి జిల్లాలో పంటలు నీట మునిగాయి. నిజామాబాద్ జిల్లాలో సోయ, కామారెడ్డి జిల్లాలో ఆరుతడి పంటలు దెబ్బతిన్నాయి. నిజాంసాగర్ మండలం తుంకిపల్లి తండా శివారులో చెరువు అలుగు పారి పంట పోలాలు మునిగిపోయాయి. తాడ్వాయి మండలం సంతాయి పేటలో వరి పొలాలు చెరువును తలపిస్తున్నాయి. బీర్కూరు మండలం బరంగ్ ఎడిగిలో వరి పొలం నీట మునిగింది.
ఇదీ చూడండి: high alert in hyderabad: మూసినదికి వరద ఉద్ధృతి.. పలు ప్రాంతాల్లో హై అలర్ట్