వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చే గర్భిణీలకు ఇబ్బందులు తప్పడం లేదు. కామారెడ్డి జిల్లా మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వారంలో ఒక్క రోజు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. శిథిలమైన భవనంలో ఆరోగ్య ఉపకేంద్రం, రక్తపరీక్ష కేంద్రంతో పాటు హెచ్ఐవీ పరీక్ష కేంద్రం ఈ భవనంలోనే కొనసాగుతున్నది. మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగునీటి సౌకర్యం, కుర్చీలు లేక... గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూత్ర పరీక్ష కోసం వచ్చిన మహిళలు ఆరు బయటకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.
ప్రతివారం వైద్యం కోసం మండలంలోని 40 గ్రామాల మహిళలు వందకుపైగా వస్తుంటారు. వీరందరికి ఒకే వైద్యుడు... ఉండడం వల్ల గంటల తరబడి మహిళలు వేచిఉండాల్సిన పరిస్థితి. ఉదయం వచ్చిన గర్భిణీలు సాయంత్రం వరకు క్యూలైన్లో ఉంటున్నారు.
కుర్చీలు లేక గర్భిణీలు నేలపైనే కూర్చుంటున్నారు. తాగునీరు లేక ఇంటి నుంచి నీళ్ల సీసాలను తెచ్చుకుంటున్నారు. అమ్మఒడి వాహనం లేక ఆటోలు, ద్విచక్రవాహనాలపై వస్తున్నారు. మద్నూర్ మండలంలోని డోంగ్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులు అధ్వానంగా మారాయి. ఆసుపత్రిలో ఒకే వైద్యుడు... దీనితో రోగులకు సరైన వైద్య సేవలు అందడం లేదు. ఈ ఆసుపత్రికి 20 గ్రామాల నుంచి రోగులు వస్తుంటారు.
మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ ఆసుపత్రులే తమకు దిక్కని రోగులు అంటున్నారు. ఇప్పటికైనా సర్కారు ఇలాంటి ఆసుపత్రులపై మరింత దృష్టి పెట్టాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి: ఈటీవీ భారత్ యాప్లో కొత్త ఫీచర్స్