కామారెడ్డి జిల్లాలో దోమకొండ గడి కోట పర్యాటక ప్రాంతానికి ప్రసిద్ధి. గడికోట వారసులు ప్రత్యేకంగా కోట ట్రస్ట్ ఏర్పాటు చేసి దాని ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన దోమకొండ ప్రజలకు ట్రస్ట్ అండగా నిలిచింది. సుమారు 150 మందికి మాస్కుల తయారీ బాధ్యత అప్పజెప్పారు. ప్రత్యేకంగా మెటీరియల్ తెప్పించి మాస్కులు తయారు చేపిస్తున్నారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న వైద్యులకు రెండు రకాల పీపీఈ కిట్లు తయారు చేస్తున్నారు. ఓ రకానికి రూ.275, మరో రకానికి రూ.305 చొప్పున ప్రభుత్వానికి సరఫరా చేస్తున్నారు. సాధారణ మాస్కు రూ.7, ఎన్-95 మాస్కు రూ.9లకు విక్రయిస్తున్నారు. గ్రామాలకు, వివిధ సంఘాలకు ఇక్కడి నుంచే సరఫరా చేస్తున్నారు. అంతే కాకుండా దాదాపు 200 కుటుంబాలు ఇళ్లలోనే మాస్కులు తయారీలో నిమగ్నమయ్యారు.
మాస్కులలో 90 జీఎస్ఎం హైజినిక్ చేసిన మెటీరియల్ ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం షోలపూర్ అధికారులు 500 పీపీఈ కిట్ల తయారీకి ఆర్డర్ ఇచ్చినట్టు ట్రస్ట్ మేనేజర్ బాబ్జీ తెలిపారు. ఉపాధి లేక కుటుంబ గడవడం ఇబ్బందికరంగా మారుతుందని భావించినవారికి మాస్కుల తయారీ పని దొరకడం పట్ల ట్రస్ట్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అవకాశం ఇస్తే పెద్దఎత్తున ఉత్పత్తి చేస్తామని తెలిపారు.
ఇదీ చూడండి: మూడు రోజుల పాటు లాక్డౌన్ ఎత్తివేయండి: తలసాని