ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల గడువు ముగియడం వల్ల ఇక పరిష్కారం దిశగా యంత్రాంగం అడుగులు వేస్తోంది. సెప్టెంబరు మొదటి వారంలో ప్రారంభమైన ఈ ప్రక్రియ రెండు నెలల పాటు కొనసాగింది. క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించడం వల్ల కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఊహించిన దానికంటే రెండింతల దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే క్షేత్రస్థాయిలో పరిశీలించి సక్రమంగా మార్చేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది.
జిల్లాకేంద్రం శివారులోని అనధికారిక ప్లాట్లు
* వివిధ లేఅవుట్లకు, ప్లాట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ డాక్యుమెంటులో ఉన్న మార్కెట్ విలువ ప్రకారం రుసుములు నిర్ధారించారు. తొలి దశలో రూ.1000 చెల్లించి స్లాట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. చరవాణి యాప్, పురపాలక శాఖ వెబ్‌సైట్(ఎల్‌ఆర్‌ఎస్-2020) ద్వారా వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. భారీగా దరఖాస్తులు రావడంతో ఎలా పరిశీలన చేయాలి? ఎన్ని విడతల్లో ప్రక్రియ చేపట్టాలో త్వరలోనే మార్గదర్శకాలు రానున్నాయి.
సిబ్బంది కొరతతో సాధ్యమేనా?
జిల్లాలో పట్టణ ప్రణాళిక విభాగ అధికారుల కొరత వేధిస్తోంది. పెద్ద మొత్తంలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి తగిన సిబ్బంది అవసరం. ప్రైవేటు వ్యక్తులను నియమించి తతంగాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు.
యజమానుల నుంచి స్పందన
కామారెడ్డి పట్టణంతో పాటు విలీన పంచాయతీల పరిధిలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఆగస్టు 26 వరకు రిజిస్ట్రేషన్ కలిగిన వారందరికి దరఖాస్తులు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించడంతో యజమానుల నుంచి స్పందన లభించింది. ప్రభుత్వం సైతం ఎల్‌ఆర్‌ఎస్‌పై విస్తృత ప్రచారం చేపట్టడంతో ప్రజల్లో చైతన్యం పెరిగి అందరూ స్లాట్ బుకింగ్‌కు ముందుకొచ్చారు.
పరిష్కారం దిశగా...
అక్రమ, అనధికారిక లేఅవుట్ల క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తుల పరిష్కారం దిశగా చర్యలు చేపడతామని జిల్లా కమిషనర్ దేవేందర్ తెలిపారు. త్వరలోనే మార్గదర్శకాలు రానున్నాయి. జిల్లాకేంద్రంలో భారీగా దరఖాస్తులు రావడంతో రూ.కోట్లలో ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నాం.
ఇదీ చూడండి: 'మీసేవా కేంద్రాల ద్వారా ధరణి పోర్టల్‌లో స్లాట్ బుకింగ్'