కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మోశంపూర్ గ్రామ సొసైటీ పరిధిలో దాదాపు ఐదు గ్రామాల రైతులు యూరియా కోసం పడిగాపులు పడుతున్నారు. వీరికి సుమారుగా నాలుగున్నర వేల బస్తాల యూరియా అవసరముండగా.. సోమవారం సొసైటీకి కేవలం 450 బస్తాలు అందుబాటులోకి వచ్చింది. వాటికి తీసుకునేందుకు అన్నదాతల కష్టాలు అన్నీ.. ఇన్నీ కావు. ఉదయం 6 గంటల నుంచే చెప్పులను ఉంచి క్యూ కట్టారు.
యూరియా కోసం మోశంపూర్ సొసైటీ పరిధిలోని రైతులే కాకుండా వేరే గ్రామాల అన్నదాతలు వచ్చి ఎదురుచూశారు. ఉదయం ఒక్కో రైతుకు రెండేసి బస్తాలు ఇస్తామన చెప్పిన అధికారులు.. ఒక్క బస్తానే ఇచ్చారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరికైతే.. అవీ రాలేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు సరిపడా యూరియాను సరఫరా చేయాలని కోరుతున్నారు.