కరోనా మహమ్మారి పేదింటి ప్రజలకు ఆర్థిక కష్టాలు తెచ్చిపెడుతోంది. నిత్యం చిన్న చిన్న పనులు చేసుకునే వారి బ్రతుకులు కరోనా వల్ల చితికి పోయాయి. ఆర్థిక భారం భరించలేక, కుటుంబాన్ని పోషించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా కుటుంబ ఆర్థిక పరిస్థితి తండ్రి కూతుళ్లు ఆత్మహత్య చేసుకునేలా చేసింది.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోసంగి కాలనీలో తండ్రి, కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది. గోసంగి కాలనీకి చెందిన అక్బర్ గతంలో రోడ్లపై మహిళల రబ్బర్ బ్యాండ్లు, పిన్నీసులు అమ్మేవాడు. ఐదేళ్ల క్రితం తండ్రి, కూతుళ్లను వదిలి తల్లి ఇంట్లోంచి వెళ్లిపోయింది.
కరోనా కారణంగా కొద్ది కాలంగా పని లేక అక్బర్ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. కాలనీలో గల గుడిసెలో తండ్రి కూతురు ఇద్దరు మాత్రమే ఉంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఆ కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసాయి. దీంతో 14 సంవత్సరాల కుమార్తె సైరా బేగంకు శీతలపానీయంలో పురుగుల మందు కలిపి తాగించాడు తండ్రి అక్బర్. తర్వాత అదే ఇంట్లో అక్బర్ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనా స్థలాన్ని కామారెడ్డి రూరల్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి, దేవునిపల్లి ఎస్సై శ్రీకాంత్ పరిశీలించారు.
ఇదీ చదవండి: ఎమ్మెల్యే మృతికి కేసీఆర్, పోచారంతోపాటు మంత్రుల సంతాపం