కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామశివారు కృష్ణ మందిరం వద్ద తెల్లవారు జామున నాలుగున్నర గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్‌ను ఢీకొన్న కారు... పక్కనే ఉన్న మర్రి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు.
నిజామాబాద్ నగరంలోని పద్మానగర్‌కు చెందిన మంథని లావణ్య(34), ఆమె కూతురు మంథని రోష్ని(15)తో పాటు నవీపేట్‌కు చెందిన ప్రశాంత్(23), ఆర్మూర్‌కు చెందిన సుశీల్ కుమార్ (21)లు అక్కడిక్కడే దుర్మరణం చెందారు.
నుజ్జునుజ్జయిన కారు
చెట్టును ఢీకొన్న కారు నుజ్జునుజ్జైంది. పక్కనే ఉన్న హోటల్ యజమాని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని చూసేసరికి కారులో ఉన్న అందరూ చనిపోయి ఉన్నారు. మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. గ్యాస్ కట్టర్లతో కారు భాగాలను తొలగించి మృతదేహాలను బయటకు తీశారు.
భర్త గల్ఫ్‌లో...
ప్రమాదంలో మరణించిన లావణ్య భర్త గల్ఫ్‌లో ఉంటారు. వీరికి ఇద్దరు పిల్లలు. కుమారుడు హైదరాబాద్‌లో ఇంటర్ చదువుతుండగా... కూతురు స్థానికంగానే తల్లితో కలిసి ఉంటోంది. లావణ్య ఇంట్లో అరుణ్‌కుమార్ అనే వ్యక్తి అద్దెకు ఉంటున్నాడు.
సెండ్ఆఫ్ చెప్పడానికి వెళ్లి...
అరుణ్‌కుమార్ ఉద్యోగం కోసం ఇరాక్ దేశం వెళ్తున్నాడు. అతనికి వీడ్కోలు పలికేందుకు తన కూతురు రోష్ని, అరుణ్ బంధువులు ప్రశాంత్, సుశీల్ రాత్రి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లారు. అరుణ్‌కు ఎయిర్‌పోర్ట్‌లో వీడ్కోలు పలికి నిజామాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.
నిద్రమత్తులో కారు ప్రయాణం
సుశీల్ కారు నడుపుతుండగా తెల్లవారు జామున నాలుగున్నర గంటలకు నిద్రమత్తు కారణంగా వాహనం అదుపు తప్పింది. అతి వేగం కారణంగా రోడ్డు పక్కన గల డివైడర్‌కు తగిలి చెట్టును బలంగా ఢీకొట్టింది. కారులో ఉన్న నలుగురూ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి వచ్చిన బంధువులు, తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా రోదించారు. వారి ఆర్తనాదాలతో ఘటనా స్థలం మిన్నంటింది.
ఇద్దరు యువకులు మరణం
సుశీల్ కుమార్(21) ఆర్మూర్‌లో మిషన్‌భగీరథలో పని చేస్తున్నాడు. నవీపేట్‌కు చెందిన ప్రశాంత్(23) నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో తన తల్లిదండ్రులతో నివాసం ఉంటున్నాడు. బీటెక్ పూర్తి చేసి ఓ హోటల్లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్నాడు.
తల్లిదండ్రుల రోదన
సుశీల్‌కుమార్, ప్రశాంత్ మృతదేహం వద్ద తల్లిదండ్రుల రోదన మిన్నంటింది. తమ జీవితాలకు బాసటగా ఉంటాడని అనుకుంటే తమకు అందనంత దూరం వెళ్లి పోయాడంటూ... విలపించారు. మంథని లావణ్య భర్త జనార్దన్ గల్ఫ్‌లో ఉన్నాడు. లావణ్య, రోష్ని ఒకేసారి దూరం కావడంతో లావణ్య తల్లిదండ్రులు హతాశులయ్యారు.
ఒక ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. కుటుంబ సభ్యుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి.