కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రానికి చెందిన ఇప్పకాయల అంజవ్వ కుటుంబాన్ని విధి పగబట్టింది. ఆమె ఏడు నెలల గర్భవతిగా ఉండగా.. భర్త వదిలేశాడు. కడుపులో ఉన్న బిడ్డ కోసం తను ఒంటరిగా పోరాడి, దొరికిన పని చేసుకుంటూ.. బిడ్డకు జన్మనిచ్చింది. కానీ పుట్టిన మగబిడ్డకు పోలియో వచ్చింది. పుట్టిన బిడ్డను దివ్యాంగుడిలా చూడకుండా విద్యాబుద్ధులు నేర్పించింది.
పగబట్టిన విధి
ఆ కొడుకు పెద్దవాడై.. మహారాష్ట్రలో ఓ ప్రైవేట్ సంస్థలో పనికి కుదిరాడు. దానితో తల్లి సంతోషించి తిరుపతికి ధర్పల్లికి చెందిన శ్రావణితో వివాహం చేసింది. తిరుపతికి ఇద్దరు పిల్లలు. ఒక కూతురు, ఒక కుమారుడు. అందరూ ఉన్నదానిలో సంతోషంగా ఉన్న సమయంలో మనవడు సాయి(18) 'నేను హీరోను అంటూ నవ్వడం..' మతిస్థిమితం లేకుండా ప్రవర్తించడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి మతిస్థిమితం సరిగ్గా లేదని చెప్పారు. ఖరీదైన వైద్యం అందిస్తేనే మాములు మనిషి అవుతాడని తెలిపారు.
విధి వంచితులయ్యారు
మనవడు సాయి మతిస్థిమితం సరిగ్గా లేదని తెలియడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా కుదుపునకు గురైంది. ఎలాగైనా సరే తన ఆరోగ్యం బాగు చేద్దామని సుమారు 5 లక్షల వరకు బయట అప్పులు తీసుకువచ్చి అతనికి హైదరాబాద్, నిజామాబాద్‌లలో ఉన్న పెద్ద కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందిస్తున్నారు. కానీ ప్రస్తుతం చేతిలో చిల్లిగవ్వ లేక బయట అప్పులు పుట్టక గత కొన్ని నెలల నుంచి వైద్యం అందించడం లేదు. రెండు సంవత్సరాల క్రితం వరకు తిరుపతి మహారాష్ట్రలో పని చేసేవాడు. కానీ కొడుకు సాయికి ఆరోగ్యం సరిగ్గా లేదని తెలిసి... ఇంటికి వచ్చాడు. సాయి రోజు నవ్వడం... ఇంట్లో ఎవరన్నా ఏమన్నా అంటే కొట్టడం లాంటివి చేస్తుండడంతో కూతురును శ్రావణి వాళ్ల అమ్మ ఇంటికి పంపించారు.
ఆపన్నహస్తం కోసం...
భర్త ఇంటి వద్ద ఉండడంతో శ్రావణి కామారెడ్డి పట్టణంలో ఒక సూపర్ మార్కెట్లో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. కరోనా రావడంతో శ్రావణి ఉపాధి కోల్పోయింది. దానితో దోమకొండలో ఉపాధి దొరక్క ఉపాధి కోసం కామారెడ్డి వచ్చారు. కానీ ఎక్కడ కూడా ఉపాధి దొరక్క పోవడంతో కుటుంబ పోషణ కష్టమై... ఓ పూట తింటూ... మరో పూట పస్తులుంటున్నారు. శ్రావణి కుటుంబ పరిస్థితి చూసి శ్రావణి తల్లిదండ్రులు మనవరాలి పెళ్లి చేశారు.
ఆదుకోండి
ఉపాధి దొరక్క పూట గడవడం కష్టం అవుతుందని శ్రావణి చెబుతోంది. అంతేగాక అద్దెకు ఉంటున్న ఇంటి అద్దె చెల్లించక 3నెలలు అవుతుందని వాపోయింది. వాళ్ల పరిస్థితి చూసి బాధ పడడమే తప్ప సహాయం చేయ్యలేక పోతున్నామని స్థానికులు వాపోయారు. తమ కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని ఎవరైనా దాతలు.. ముందుకు వస్తారని ఆ కుటుంబం ఎదురుచూస్తోంది.
- ఇదీ చూడండి: కొత్త పింఛన్ల అంశంపై బడ్జెట్లో స్పష్టత...!