జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం పరిధిలోని ఆర్డీఎస్ కాలువ ద్వారా దాదాపు 85 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. గతంలో ఆర్డీఎస్ ప్రధాన కాలువకు అరకొర నీరు రావడంతో రైతులు చాలా ఇబ్బంది పడేవారు. అనంతరం ప్రభుత్వం రాజోలి మండలం తుమ్మల గ్రామం వద్ద తుంగభద్ర నదిపై ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి... ఆర్డీఎస్ ప్రధాన కాలువను 21వ డిస్ట్రిబ్యూటరీ కాలువ వద్ద అనుసంధానం చేసింది.
జూరాల నీటి అనుసంధానం...
ఆ తరువాత చివరి ఆయకట్టు డీ 40 ద్వారా... అలంపూర్ వరకు నీరు అందాలనే ఉద్దేశంతో మానవపాడు మండల శివారులో... డీ 31 వద్ద జూరాల నీటిని కూడా ఆర్డీఎస్ కాలువకు అనుసంధానం చేశారు. కానీ... డిస్ట్రిబ్యూటరీ కాలువల ఆధునీకరణ పనులు చేపట్టకపోవడంతో ప్రతి సంవత్సరం ఎక్కడో ఓ చోట కాలువలకు కోతలు ఏర్పడి పంటపొలాల్లోకి నీరు ప్రవహిస్తూ రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ఈ ఆర్డీఎస్ ప్రధాన కాలువ డీ 21 నుంచి ప్రారంభమై డీ 40 ఆలంపూర్ చివరి వరకు కొనసాగుతుంది.
సర్వసాధారణం...
ఆర్డీఎస్ ప్రధాన కాలువకు నీరు విడుదల చేసిన ప్రతిసారి కోతలు పడటం సర్వసాధారణంగా మారింది. కాలువ లైనింగ్ దెబ్బతినడంతో పాటు ముళ్ల పొదలు, ఇతర వ్యర్థాలు పేరుకుపోయాయి. చాలాచోట్ల డిస్ట్రిబ్యూటరీ కాలువల వద్ద షెటర్లు కూడా ధ్వంసమయ్యాయి. దీంతో నీరు ఆపే పరిస్థితి లేక కాలువలు కోతకు గురవుతున్నాయి. గతేడాది సిందనూరు సమీపంలో కాల్వకు కోత ఏర్పడి సుమారు 100 ఎకరాల వరి పంట నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి...
రెండు రోజుల కిందట జూరాల నుంచి ఆర్డీఎస్ ప్రధాన కాలువకు నీరు విడుదల చేయడంతో... డీ 34 డిస్ట్రిబ్యూటరీ వద్ద కాలువ పూర్తిగా దెబ్బతిని కోతకు గురైంది. దీని కారణంగా పొలాల నుంచి నీరు ప్రవహించి, భూమి పూర్తిగా కోతకు గురైందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి సంవత్సరం ఆర్డీఎస్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చిన పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కాలువల ఆధునీకరణ పనులు చేపట్టాలని కోరుతున్నారు.
ప్రభుత్వమే ఆదుకోవాలి...
'మాకు ఆర్డీఎస్ కింద రెండున్నర ఎకరాల పొలం ఉంది. ఇటీవల వచ్చిన వర్షాల కారణంగా కాలువలో ఆరు ఫీట్ల ఎత్తు వరకు నీరు వచ్చాయి. షెటర్లు లేక నీరు పొలంలోకి రావడంతో... కాలువ చుట్టుపక్కల ఉన్న పోలాలన్నీ నీట మునిగాయి. గత సంవత్సరంలోనూ తీవ్రంగా నష్టపోయాను. ప్రభుత్వం స్పందించి కాలువకు ఆధునీకరణ పనులు చేపట్టాలి. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించి తమను ఆదుకోవాలి.'
---- నర్సింహారెడ్డి, రైతు, ఇటిక్యాల గ్రామం...
అధికారుల నిర్లక్ష్యమే కారణం...
'గత నాలుగు ఏళ్లుగా కాలువలో చెట్లు, మట్టిని తొలగించకుండా అధికారుల నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. కాలువకు సంబంధించి డిస్ట్రిబ్యూటరీల దగ్గర షెటర్లు లేకపోవడం వల్ల... నీరు ఎక్కువ వచ్చినప్పుడు పంటపొల్లాలోకి వస్తున్నాయి. దీని కారణంగా వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లుతోంది. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ప్రస్తుతం నిధులు లేవని... దాటవేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగిన పరిష్కారం చూపి... రైతులు నష్టపోకుండా చూడాలి'
---- సురవరం లోకేశ్వర్‌రెడ్డి, ఇటిక్యాల గ్రామ సర్పంచ్...
ఇదీ చదవండి: Skill training: క్రాష్ కోర్స్ ప్రోగ్రామ్- లక్ష మందికి శిక్షణ!